Share News

వైజాగ్‌ వెళుతున్నామని చెప్పి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:30 AM

నగరం లోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న పాత వంతెనపై శనివారం వేకువజామున కాయగూరల లోడ్‌తో వస్తున్న వ్యాన్‌... ఏడు రోడ్ల జంక్షన్‌ నుంచి విశాఖ పట్నం వైపు వెళుతున్న మోటార్‌ సైకిల్‌ ఢీ కొన్నా యి.

 వైజాగ్‌ వెళుతున్నామని చెప్పి..
సంఘటన స్థలంలో గుమిగూడిన ప్రజలు

  • ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు యువకులు

  • ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

శ్రీకాకుళం క్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నగరం లోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న పాత వంతెనపై శనివారం వేకువజామున కాయగూరల లోడ్‌తో వస్తున్న వ్యాన్‌... ఏడు రోడ్ల జంక్షన్‌ నుంచి విశాఖ పట్నం వైపు వెళుతున్న మోటార్‌ సైకిల్‌ ఢీ కొన్నా యి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా...ఇద్దరు గాయపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ... జిల్లాలోని కవిటికి చెందిన వంజరాపు నారాయణరావు శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో లక్ష్మీ థియేటర్‌ వద్ద ముత్యాలమ్మ హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి కాయగూరలను కొనుగోలు చేసి వ్యాన్‌లో ఏడు రోడ్ల జంక్షన్‌ వైపు వెళుతున్నాడు. పాత వంతెనపైకి వచ్చేసరికి ఎదురుగా వాహనంతో అతివేగంతో వస్తూ ముగ్గురు యువకులు వ్యాన్‌ను బలంగా ఢీకొని వంతెనపై పడిపోయారు. ఈ సంఘటనలో దమ్మల రెల్లివీధికి చెందిన మాడుగుల సుభాష్‌ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మాడుగుల సుబ్రహ్మణ్యం (25)కు తలకు బలమైన గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడో యువకుడు ధనాల సిద్ధుకు చేతికి గాయమవడంతో చికిత్స పొందుతున్నాడు.

శిక్షణ పూర్తి చేసుకుని...

మృతుడు మాడుగుల సుభాష్‌ సీమేన్‌ శిక్షణ పూర్తి చేసుకొని ఇటీవలే ఇంటికి వచ్చాడు. సుభాష్‌ తండ్రి చంద్రశేఖర్‌ నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో చేపల వ్యాపారం చేస్తున్నాడు. మరో యువకుడు మాడుగుల సుబ్రహ్మణ్యం తండ్రి రమేష్‌ విశాఖపట్నం డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగి. సుబ్రహ్మణ్యం.. తన పెద్దనాన్న మాడుగుల చంద్రశేఖర్‌ ఇంటికి అమ్మవారి పండగలకు స్నేహితుడు ధనాల సిద్ధూ ప్ర శాంత్‌తో కలిసి వచ్చాడు. వీరు ముగ్గురు ఒకే వాహనంపై శనివారం వేకు వజామున విశాఖపట్నం వెళతామని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఇంటి నుంచి వెళ్లిన కొంతసేపటికే ప్రమాదానికి గురయ్యారు. మాడుగుల సుభాష్‌, సుబ్రహ్మణ్యం (సుబ్బు) ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సుభాష్‌ తండ్రి చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ సీఐ వానపల్లి రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:30 AM