భోజనం తెస్తానని చెప్పి...
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:28 AM
‘ప్రార్థనకు వెళుతున్నా. తిరిగి వచ్చేటపుడు మీ కోసం భోజనం పార్శిల్ తీసుకొస్తా. మీరు ఏం తింటారో చెప్పండి’ అని కుటుంబ సభ్యులకు అడిగిన ఆ వ్యక్తి.. ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ‘ప్రార్థనకు వెళుతున్నా. తిరిగి వచ్చేటపుడు మీ కోసం భోజనం పార్శిల్ తీసుకొస్తా. మీరు ఏం తింటారో చెప్పండి’ అని కుటుంబ సభ్యులకు అడిగిన ఆ వ్యక్తి.. ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కొద్దిసేపటి క్రితం వరకు తమతో ఉన్న ఇంటి పెద్ద విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదీ నగరానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి చుక్కా సంతోష్ దొర (36) విషాదాంతం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలివీ... నగరంలోని హడ్కో కాలనీలో ఉంటున్న సంతోష్‌దొర ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీకాకుళం కొత్త రోడ్డు ప్రాంతంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లి... తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో ఆదివారంపేట వద్ద తన ద్విచక్ర వాహనాన్ని ఓచోట నిలిపి... రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో సంతోష్‌దొర అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎంఆర్‌టీ డివిజన్‌లోని హెచ్‌టీ మీటర్ విభాగంలో జూనియర్ లైన్‌మన్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్ స్వస్థలం వీరఘట్టం మండలం చిమ్మి గ్రామం. ఉద్యోగరీత్యా నగరంలోని హడ్కో కాలనీలో భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ కరణం వెంకటసురేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.