Share News

‘నేరడి’తో సస్యశ్యామలం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:30 AM

Project negligence of the YCP government జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార నదిపై అత్యంత ప్రాధాన్యం కలిగిన నేరడి బ్యారేజీని నిర్మించి తీరుతామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

‘నేరడి’తో సస్యశ్యామలం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టుకు అడ్డంకులు

సమర్థులైన న్యాయవాదుల నియామకంతో ట్రిబ్యునల్‌ విజయం

సీఎం, కేంద్రమంత్రి కృషితోనే కేంద్రం గెజిట్‌

ప్రతి ఎకరాకూ సాగునీరు, ఇంటింటికీ తాగునీరే మా లక్ష్యం

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార నదిపై అత్యంత ప్రాధాన్యం కలిగిన నేరడి బ్యారేజీని నిర్మించి తీరుతామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ‘నేరడి’ అంశమై సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే నేరడి బ్యారేజీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ‘జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే మా లక్ష్యం. వంశధార-నేరడి బ్యారేజీ ఎప్పుడో పూర్తి కావాల్సింది. గత ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో సరైన న్యాయవాదులను నియమించకపోవడంతో బలమైన వాదనలు వినిపించలేకపోయారు. తద్వారా ప్రాజెక్టుకు అనేక సమస్యలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైపుణ్యం కలిగిన న్యాయవాదులను నియమించడంతో ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నెగ్గింది. స్పష్టమైన తీర్పు వచ్చింది. దీని ఫలితంగానే, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేలా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విశేష కృషి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కోర్టులో ప్రస్తుతం చిన్న అడ్డంకి మాత్రమే ఉంది. అది పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశార’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 12:30 AM