Share News

‘ఉమ్లింగ్‌ లా’పై సంతబొమ్మాళి వాసి

ABN , Publish Date - May 23 , 2026 | 11:43 PM

Prabhu Kumar finds a place in Guinness World Records సంతబొమ్మాళి మండల కేంద్రానికి చెందిన కళింగపట్నం ప్రభుకుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

‘ఉమ్లింగ్‌ లా’పై సంతబొమ్మాళి వాసి
ఉమ్లింగ్‌ లా శిఖరం వద్ద గిన్నిస్‌బుక్‌ గుర్తింపు పత్రంతో ప్రభుకుమార్‌

సాహసయాత్రకు గుర్తింపుగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ప్రభుకుమార్‌కు చోటు

సంతబొమ్మాళి, మే 23(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండల కేంద్రానికి చెందిన కళింగపట్నం ప్రభుకుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తయిన జమ్ము- కశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో ఉమ్లింగ్‌ లా పై బైక్‌ రైడింగ్‌ చేసి.. విజయం సాధించాడు. మోటారు మార్గంగా గుర్తింపు పొందిన ఉమ్లింగ్‌ లా.. దారిపొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రభుకుమార్‌ అంత ఎత్తువరకూ ప్రయాణించి ఈ ఘనత సాధించాడు. ఈ నెల 5న యాత్ర ప్రారంభించి.. 16 రోజుల్లో పూర్తిచేశాడు. ఆయన సాహసయాత్రను గుర్తిస్తూ.. శనివారం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో ప్రభుకుమార్‌ తండి కళింగపట్నం లక్ష్మీఅప్పారావు (సంతబొమ్మాళి తాజా మాజీ సర్పంచ్‌), కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 23 , 2026 | 11:43 PM