Share News

అంతటా సంబరం

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:24 AM

Sankranthi.. Kanuma Celebration జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, ఉద్యోగులు పండుగ వేళ సొంతూళ్లకు చేరుకోవడంతో పల్లెలు కళకళలాడాయి. గురు, శుక్రవారాల్లో సంక్రాంతి, కనుమ వేడుకలను జిల్లావాసులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు.

అంతటా సంబరం
ఏకశిలాపర్వతంపై భక్తజన సందోహం

  • ఉత్సాహంగా సంక్రాంతి, కనుమ

  • శ్రీకాకుళం/జి.సిగడాం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, ఉద్యోగులు పండుగ వేళ సొంతూళ్లకు చేరుకోవడంతో పల్లెలు కళకళలాడాయి. గురు, శుక్రవారాల్లో సంక్రాంతి, కనుమ వేడుకలను జిల్లావాసులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. పలుచోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు గాలిపటాలు, డ్యాన్స్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పేరంటాలకు ముర్రాటలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అరసవల్లి, శ్రీముఖలింగం తదితర ప్రముఖ దేవాలయాల్లో గోపూజను విశేషంగా నిర్వహించారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో కూడా సందడి కనిపించింది. మరోవైపు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మాంసం మార్కెట్లు కిటకిటలాడాయి. చేపలు, కోడి మాంసం, మటన్‌ కోసం జనం ఎగబడ్డారు. అలాగే మద్యం దుకాణాల వద్ద మందుబాబులు సందడి చేశారు.

  • ఏకశిలాపర్వతం.. భక్తజన సంద్రం

  • సంక్రాంతి పర్వదినం వేళ.. జి.సిగడాం మండలం మెట్టవలసలోని ఏకశిలాపర్వతం భక్తజన సంద్రంగా మారింది. ఏకాశిలపర్వతంపై కొలువుదీరిన మల్లికార్జునస్వామి యాత్ర గురువారం నిర్వహించారు. ఈ యాత్రకు జి.సిగడాం, పొందూరు, సంతకవిటి, రాజాం తదితర మండలాలతోపాటు.. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలను తిలకించారు. ఎటువంటి అవాంఛచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • దవళపేటలో పొట్టేళ్ల ప్రదర్శన

  • జి.సిగడాం మండలం దవళపేటలో గురువారం సంక్రాంతి పర్వదినం పురష్కరించుకొని గ్రామ యువకుల ఆద్వర్యంలో నిర్వహించిన పొట్టేళ్ల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో సుమారు 50 పొట్టేళ్లు పాల్గొన్నాయి. ఏ కేటగి, బీ కేటగిరి, కన్సోలేషన్‌ టీమ్‌లుగా విడదీసి పోటీల్లో ప్రవేశపెట్టారు. పొట్టేళ్లు పోటాపోటీగా తలపడ్డాయి. మాజీ సర్పంచ్‌ కంచరాన సూరన్నాయుడుకు చెందిన పొట్టేలు ఏ కేటగిరిలో, పేడాడ రాజారావు పొట్టేలు బీ కేటగిరిలో మిగతా పొట్టేళ్లు కన్సోలేషన్‌ కేటగిరిలో నిలిచాయి. వీరికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

  • పండగ వేళ.. రోడ్లు నిర్మానుష్యం

  • సంక్రాంతిని పురస్కరించుకుని పల్లెలు కళకళలాడగా.. జిల్లాకేంద్రంలో రోడ్లు, ప్రధాన జంక్షన్లు మాత్రం నిర్మానుష్యంగా మారిపోయాయి. నగరవాసులు అధిక శాతం స్వగ్రామాలకు వెళ్లిపోయారు. మరికొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌, జీటీ రోడ్డు, పొట్టిశ్రీరాముల మార్కెట్‌, పాలకొండ రోడ్డు తదితర జంక్షన్లు శుక్రవారం వెలవెలబోయాయి. వాణిజ్య సముదాయాలు సైతం ఖాళీగా దర్శనమిచ్చాయి.

Updated Date - Jan 17 , 2026 | 12:24 AM