ఇసుక.. విశాఖకు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:07 AM
Illegal movement of sand జిల్లా నుంచి విశాఖపట్నానికి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల సంఖ్య లారీలతో ఇసుక లోడ్లు తరలిస్తున్నారు.
జిల్లా నుంచి యథేచ్ఛగా అక్రమ తరలింపు
రోజుకు సగటున 300 లారీల్లో రవాణా
పైడిభీమవరం వద్ద చెక్‌పోస్టులో అంతంతమాత్రమే తనిఖీలు
పట్టుబడుతున్నా.. మారని తీరు
ఈ నెల 10న జిల్లా నుంచి విశాఖకు తరలిస్తున్న పది ఇసుక లారీలను విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న ఆ ఇసుక లారీలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వారు ఆ లారీలకు రూ.లక్షల్లో జరిమానా విధించారు.
ఈ నెల 16న శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు జాతీయరహదారిపై వెళ్తున్న 8 ఇసుక లారీలను రణస్థలంలోని బీరు పరిశ్రమ సమీపాన జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ ఎస్.చిరంజీవి పట్టుకున్నారు. బిల్లులను పరిశీలించారు. అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించి లారీల యజమానులకు అపరాధ రుసుం విధించారు.
రణస్థలం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి విశాఖపట్నానికి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల సంఖ్య లారీలతో ఇసుక లోడ్లు తరలిస్తున్నారు. అధికారుల తనిఖీ వేళ పట్టుబడితే జరిమానా విధిస్తున్నారు. కానీ తర్వాత పరిస్థితి షరామామూలే. ఇసుక రవాణాకు సంబంధించి జిల్లా సరిహద్దు ప్రాంతమైన పైడిభీమవరంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. గతేడాది ఈ చెక్‌పోస్టులో తనిఖీలు చేపట్టగా సగానికిపైగా నకిలీ ధ్రువపత్రాలతోనే ఇసుకను తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిత్యం ఆ చెక్‌పోస్టులో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉండేవారు. షిఫ్టులవారీగా పనిచేసేవారు. కానీ ఇటీవల సిబ్బంది కొరత, ఇతరత్రా కారణాలతో గతం మాదిరిగా కట్టుదిట్టమైన తనిఖీలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా మీదుగా ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా తరలిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ రెండు నదుల్లో.. వందల లారీల్లో..
జిల్లాలోని వంశధార, నాగావళి నదులు ఇసుక అక్రమార్కులకు వరంగా మారాయి. నదులు, రీచ్‌ల్లో బరి తెగించి ఇసుక తవ్వకాలు చేపట్టి.. రవాణా సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అధికారికంగా 18 రేవులకు అధికారులు అనుమతులిచ్చారు. వంశధారకు సంబంధించి కొత్తూరు మండలం నుంచి గార మండలం వరకూ పలు రేవులు ఉన్నాయి. నాగావళి నదికి సంబంధించి బూర్జ మండలం నుంచి శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల మండలం పరిధిలో పలు రేవులకు అనుమతిచ్చారు. తవ్వకాలకు సంబంధించి డిస్టిలేషన్ కింద అంగూరు, గార, ఖాకండ్యాం... సెమీ మైకనైజ్డ్ కింద అంధవరం, బైరి, దొంపాక రీచ్‌లకు అనుమతులు ఉన్నాయి. మాన్యూవల్ పద్ధతిలో హయాతీనగరం, కిల్లిపాలెం, ముద్దాడపేట (ఆమదాలవలస), ముద్దాడపేట(ఎచ్చెర్ల), నివగాం, పర్లాం, పురుషోత్తపురం-1,2, అంబళ్లవలస, బట్టేరు, బూరవల్లి, గోపాలపెంటలో రేవులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం అంగూరు, కిల్లిపాలెం, ముద్దాడపేట(ఎచ్చెర్ల) రేవులు నిలిపివేశారు. మిగతా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు, సేకరణ, ఆపై రవాణా జరుగుతోంది. కానీ జిల్లాలో ఎక్కడా మాన్యువల్ పద్ధతిలో జరగడం లేదు. యంత్రాలతో తవ్వకాలు చేసి ఇసుక తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లా నుంచి రోజుకు సగటున 300 లారీల్లో ఇసుక విశాఖ నగరానికి తరలిస్తున్నారు. ఒక్కో లారీ ఇసుక జిల్లాలో రూ.12 వేల వరకూ పలుకుతుండగా.. విశాఖలో మాత్రం రూ.20 వేలకుపైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో రేవుల నుంచి నెలకు సగటున రూ.10కోట్ల వరకూ ఇసుక విశాఖ అవసరాలకు తరలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. పైడిభీమవరంలో పూర్తిస్థాయిలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
నిత్యం తనిఖీలు
పైడిభీమవరంలో చెక్‌పోస్టు కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయినా సరే నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తాం.
- సనపల కిరణ్‌కుమార్ తహసీల్దారు, రణస్థలం