Share News

బాహుదాలో ఇసుకను తోడేస్తున్నారు

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:52 PM

Bahuda river.. sand mining బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా లొద్దపుట్టి, జగన్నాథపురం సమీపంలో ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

బాహుదాలో ఇసుకను తోడేస్తున్నారు
రత్తకన్న సమీపంలోని తోటల్లో ఇసుక నిల్వలు

నదిలో యథేచ్ఛగా తవ్వకాలు

వర్షాకాలంలో గ్రామాలకు వరద ముప్పు

అక్రమార్కులపై కానరాని చర్యలు

ఆందోళనలో ప్రజలు

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా లొద్దపుట్టి, జగన్నాథపురం సమీపంలో ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఆయా గ్రామాల ప్రజలు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా తమకు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాహుదా నది.. ఒడిశాలో పుట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 12వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇచ్ఛాపురం పట్టణంతోపాటు మరో 30 గ్రామాలకు తాగునీటి ప్రధాన ఆధారం కూడా బాహుదే. కానీ నదికి సంబంధించి సరైన నిర్వహణ లేదు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, గత పాలకుల తప్పిదాలు, నీటి ప్రవాహం మార్పులు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒడిశా ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు కింద ప్రాంతంగా ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. లెక్కలేనన్ని ఎత్తిపోతల పథకాలు ఒడిశా ప్రాంతాల్లో నిర్మించారు. వాటన్నింటినీ దాటుకొని కింది ప్రాంతాలకు నీరు రావడం గగనమవుతోంది. తాజాగా ఇసుక తవ్వకాలకు అడ్డాగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ.. రోజూ పదుల సంఖ్యల ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. రత్తకన్న-మశాఖపురం గ్రామాల మధ్య తోటల్లో ఇసుక నిల్వలు చేసి.. అక్కడి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ విక్రయిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొంథా తుఫాన్‌ సమయంలో జగన్నాథపురం వద్ద నదిలో ఇసుక తవ్వకాల కారణంగా నీరు గ్రామంలోకి చొచ్చుకొచ్చిందని పేర్కొంటున్నారు. తవ్వకాలను అడ్డుకోకపోతే భవిష్యత్‌ మరింత ముంపు ముప్పు తప్పదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వస్తున్న మాట నిజమే. దీనిపై దృష్టి పెట్టాం. ఆయా గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తాం.

- ఎన్‌.వెంకటరావు, తహసీల్దారు, ఇచ్ఛాపురం

Updated Date - Feb 01 , 2026 | 11:52 PM