Share News

ఇసుక తరలించేస్తున్నారు

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:49 PM

Sand mining in Bahuda River ఇసుకాసురులకు బాహుదా నది వరంలా మారింది. రోజూ రాత్రివేళ బాహుదా నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వి.. తరలించేస్తున్నారు. బెల్లుపడ, రత్తకన్న తోటల్లో డంపింగ్‌ చేస్తున్నారు. ఉదయం వేళ ఇచ్ఛాపురం మీదుగా ప్రతిరోజూ కనీసం 50 నుంచి 100 లోడ్ల వరకూ ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

ఇసుక తరలించేస్తున్నారు
ఇచ్ఛాపురం పట్టణం మీదుగా ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక

  • బాహుదా నదిలో రాత్రిపూట తవ్వకాలు

  • బెల్లుపడ, రత్తకన్న తోటల్లో డంపింగ్‌

  • ఇచ్ఛాపురం మీదుగా యథేచ్ఛగా రవాణా

  • పట్టించుకోని అధికారులు

  • ఇచ్ఛాపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఇసుకాసురులకు బాహుదా నది వరంలా మారింది. రోజూ రాత్రివేళ బాహుదా నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వి.. తరలించేస్తున్నారు. బెల్లుపడ, రత్తకన్న తోటల్లో డంపింగ్‌ చేస్తున్నారు. ఉదయం వేళ ఇచ్ఛాపురం మీదుగా ప్రతిరోజూ కనీసం 50 నుంచి 100 లోడ్ల వరకూ ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు ఒడిశా, పరిసర ప్రాంతాలకు అక్రమ రవాణా సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, అధికారులు కళ్లెదుటే ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్నిపార్టీల నేతలు ఇసుక అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యం కావడంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

  • తవ్వకాలతో ఇబ్బందులు..

  • బాహుదా నది ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇచ్ఛాపురం పట్టణంతో పాటు మరో 30 గ్రామాలకు సాగునీటి ప్రధాన ఆధారం కూడా బాహుదే. కానీ నదికి సంబంధించి సరైన నిర్వహణ లేదు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, గత పాలకుల తప్పిదాలు, నదిలో నీటి ప్రవాహం మార్పులు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాహుదా నది ఇచ్ఛాపురం చెంత నుంచే ప్రవహిస్తున్నా.. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చలేకపోతోంది. ఒడిశా ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు కింద ప్రాంతంగా ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతోంది. తాజాగా ఇసుక రవాణా, తవ్వకాలు యథేచ్ఛగా సాగుతుండడంతో భవిష్యత్‌ మరింత ముప్పు తప్పదని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • కఠినచర్యలు తప్పవు

    బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు చేపడతాం. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఆయా గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

    - ఎన్‌.వెంకటరావు, తహసీల్దార్‌, ఇచ్ఛాపురం

Updated Date - Mar 15 , 2026 | 11:49 PM