Share News

వంశధార వంతెనకు మోక్షం

ABN , Publish Date - May 21 , 2026 | 12:22 AM

Approval of revised estimates జిల్లా ప్రజలు, పర్యాటకులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వంశధార హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే.. వంతెన పనులకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

వంశధార వంతెనకు మోక్షం

సీఎం హామీ ఇచ్చిన నాలుగో రోజే.. ఉత్తర్వులు

సవరించిన అంచనాలకు ఆమోదం

రూ. 84 కోట్లతో పనులకు గ్రీన్‌సిగ్నల్‌

నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు

శ్రీకాకుళం, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు, పర్యాటకులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వంశధార హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే.. వంతెన పనులకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 16న నరసన్నపేట పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ వంతెన సమస్యను తీసుకువెళ్లారు. ‘పోలాకి మండలం వనితమండలం గ్రామం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాలిహుండాన్ని కలుపుతూ వంశధార నదిపై నిర్మించతలపెట్టిన వంతెన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తక్షణమే నిధుల మంజూరు చేయాల’ని ఎమ్మెల్యే కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి వంతెన పనుల సవరించిన అంచనాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ కావడం విశేషం.

పదేళ్ల నిరీక్షణ.. పెరిగిన వ్యయం

వంశధార హైలెవల్‌ వంతెన నిర్మాణానికి సంబంధించి 2016 జూన్‌ 4న అప్పటి ప్రభుత్వం జీవో నెం.329 ద్వారా రూ.72కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సుదీర్ఘ కాలం గడిచిపోవడంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, పాత అంచనాలతో పనులు చేయడం సాధ్యం కాకపోవడంతో కాంట్రాక్టరు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఈఎన్సీ(ఆర్‌అండ్‌బీ) ఈ ఏడాది ఏప్రిల్‌ 6న ప్రభుత్వానికి సవరించిన వర్కింగ్‌ ఎస్టిమేట్స్‌(పని అంచనాలు) పంపారు. జీఎస్టీ, ధరల సవరణ, టీపీ, సీనరేజ్‌ చార్జీల పెరుగుదల కారణంగా వంతెన నిర్మాణ వ్యయం రూ.72 కోట్ల నుంచి రూ.84 కోట్లకు పెరిగినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వినతి, ఈఎన్సీ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పెరిగిన రూ.12 కోట్ల అదనపు వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రూ. 84 కోట్లతో సవరించిన వర్కింగ్‌ ఎస్టిమేట్‌కు అనుమతిస్తూ రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు జీవో ఆర్టీ నెం. 286 జారీచేశారు. ఆర్థిక శాఖ ఏకాభిప్రాయంతో ఈ నిధులకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సవరించిన అంచనాలకు ఆమోదం లభించడంతో తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్‌అండ్‌బీ ఈఎన్సీని ప్రభుత్వం ఆదేశించింది.

హర్షాతిరేకాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన తక్షణ స్పందనపై నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక బౌద్ధారామ క్షేత్రమైన శాలిహుండానికి పర్యాటకుల తాకిడి పెరగడానికి, వనితమండలం పరిసర ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలు తీరడానికి ఈ వంతెన ఎంతో కీలకం. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రత్యేక చొరవతో దశాబ్ద కాలపు నిరీక్షణకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిష్కారం లభించిందని జిల్లావాసులు సంబరపడుతున్నారు.

Updated Date - May 21 , 2026 | 12:22 AM