‘తల్లికి వందనం’ అందలే!
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:52 PM
జిల్లాలో ఆరు వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఇప్పటికీ తల్లికి వందనం నిధులు జమకాలేదు.
- ఐదు నెలలవుతున్నా జమకాని నిధులు
- వివిధ కారణాలు చూపుతూ నిలిపివేత
- జిల్లాలో 6వేల మంది ఎదురుచూపు
- టెక్కలి మండలం నర్శింగపల్లి సచివాలయం పరిధిలోని ఈ బాలిక పేరు వజ్జిల లిఖిత. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు పుష్ప, ఫల్గుణరావు నిరుపే దలు. లిఖితకు సంబంధించి తల్లికి వందనం నిధులు ఆమె తల్లి పుష్ప ఖాతాలో ఇంతవరకూ జమకాలేదు. సచివాలయానికి పలుమార్లు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ప్రతిసారీ సచివాలయ సిబ్బంది తనిఖీ చేసి ‘నాట్ ఇన్ టీవీ డేటాసెట్’ అని వస్తుందని చెబుతున్నారు. దీంతో ఆ తల్లి విసిగి వేసారిపోయింది.
టెక్కలి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఇప్పటికీ తల్లికి వందనం నిధులు జమకాలేదు. ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. జిల్లాలో 2,74,893 మంది పిల్లలకు సంబంధించి 1,81,243 మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది. అయితే, జిల్లాలో అనేకమంది విద్యార్థులకు ఈ పథకం అందలేదు. డేటా నాట్ ఫౌండ్, నెలవారీ విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారని, ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నారని, నాలుగుచక్రాల వాహనం కలిగిఉన్నారని, మూడు ఎకరాల సేద్యం భూమి దాటి ఉన్నారని.. ఇలా అనేక కారణాలు చూపుతూ ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేయలేదు. ఇలాంటి వారంతా ఆయా శాఖల వారీగా వెళ్లి నోఅబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చి సచివాలయాల ద్వారా గ్రీవెన్స్‌లో సమర్పించి నెలలు కావస్తున్నా డబ్బులు మాత్రం ఖాతాల్లో పడలేదు. కొంతమంది తల్లులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై సచివాలయాల డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్ల వివరణ కోరగా.. ‘తల్లికి వందనం నిధులు పడని వారికి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేశాం. రెండో విడత కోసం వేచిచూస్తున్నాం’. అని తెలిపారు.