Share News

తప్పులు దిద్దుకుంటేనే ‘తల్లికి వందనం’

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:27 AM

విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే తల్లికి వందనం పథకం రెండో ఏడాది ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

 తప్పులు దిద్దుకుంటేనే ‘తల్లికి వందనం’

- ఎమ్మార్సీలలో అవకాశం

- అర్హుల జాబితా సిద్ధం

- ఈనెలలో తల్లుల ఖాతాల్లో నగదు జమ

- పాఠశాలల వారీగా జాబితా విడుదల

నరసన్నపేట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే తల్లికి వందనం పథకం రెండో ఏడాది ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రకటించింది. సాంకేతిక సమస్యలు ఉన్న విద్యార్థుల జాబితాను పాఠశాలలు వారీగా ప్రకటించింది. వారంతా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు వెళ్లి ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తల్లికి వందనం పథకం లబ్ధిపొందాలంటే తల్లి బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమై ఉండాలి. గతేడాది కొందరి ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో వేలాది మంది ఈపథకానికి దూరమయ్యారు. వారంతా ఆధార్‌ కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడరానిపాట్లు పడ్డారు. ఈ ఏడాది అలాంటి పాట్లు పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే తల్లుల బ్యాంకు ఖాతాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యూడైస్‌లో తల్లి, విద్యార్థి ఆధార్‌ నెంబర్ల నమోదులో పొరపాట్లు ఉంటే వాటి దిద్దుబాటుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. రెండుమూడురోజుల్లో సరిచేసుకున్న తరువాత అర్హుల జాబితాను మరోమారు ప్రకటించనున్నారు.

ఇలా తెలుసుకోవచ్చు...

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అర్హుల జాబితాలో పేరు లేని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి. వారు మీ వివరాలను సరిచూసి ఏమైందో చెబుతారు. లేదా మై ఆధార్‌ సెక్షన్‌ లింక్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ సర్వీసెస్‌ కింద చెక్‌ ఆధార్‌ లేదా బ్యాంకు లింకేజీ స్టేటస్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆధార్‌ సంఖ్య, క్యాప్చాను నమోదు చేయాలి. సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేస్తే సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ వస్తుంది. అది నమోదు చేయగానే స్ర్కీన్‌పై ఆధార్‌ ఏ బ్యాంకుఖాతాకు లింక్‌ అయిందో తెలుస్తుంది. సరిచేసిన బ్యాంకు ఖాతాలను ఎమ్మార్సీ (ఎంఈవో) కార్యాలయంలో ఇస్తే యాక్టివ్‌ ఖాతాను అప్‌లోడ్‌ చేస్తారు.

జిల్లాలో 2,652 ప్రభుత్వ, 385 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3037 పాఠశాలల్లో 2,85,465 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ విద్యార్థులు 1,59,032 మంది ఉన్నారు. వీరందరూ తల్లికి వందనం పథకానికి అర్హులే. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో సుమారు 30వేల మంది వరకు విద్యార్థులు చేరే అవకాశముంది. వీరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ లెక్కన జిల్లాకు సుమారు రూ. 410కోట్లు వరకు ప్రభుత్వం వెచ్చించనుంది. గతేడాది ఈపథకం కింద సుమారు 2.56 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమచేసింది. ఈ ఏడాది ఈపథకానికి అర్హులైన వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఫిర్యాదులను స్వీకరించి.. సమస్యను పరిష్కరించి అర్హుల జాబితాను ఈనెల రెండోవారంలో ప్రకటిస్తారు. తుది జాబితాను ఈనెల చివరిలో ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత తల్లుల ఖాతాల్లో రూ. 13వేలు చొప్పున జమకానుంది. మిగిలిన రూ. 2వేలు పాఠశాలల అభివృద్ధికి ఖర్చుచేస్తారు.

ఆదేశాలు జారీ చేశాం

విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు, వాటితో అనుసంధానమైన ఆధార్‌ సంఖ్య సరిగా ఉందోలేదో సరిచూసుకోవాలని పాఠశాలల హెచ్‌ఎంల ద్వారా తల్లిదండ్రులకు ముందుస్తుగా సమాచారం ఇచ్చాం. గతంలో జరిగిన తప్పిదాలు ఈఏడాది దొర్లకుండా ఉండేందుకు మండల రిసోర్సు కేంద్రాల్లో యూడైస్‌లో వివరాలు సరిచేసేందుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. యాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలు తీసుకువచ్చి నమోదు చేసుకోవాలి.

-ఎ.రవిబాబు, డీఈవో

Updated Date - Jun 04 , 2026 | 12:27 AM