Share News

ఆపద్బాంధవులకు భరోసా

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:40 PM

Ambulance employees.. Salary hike అత్యవసర వేళ ఆపద్బాంధవులుగా సేవలందిస్తున్న 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అలాగే కొత్తగా చేరి.. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.

ఆపద్బాంధవులకు భరోసా
టెక్కలిలో 108 ఉద్యోగుల హర్షం

  • ‘108’ అంబులెన్స్‌ ఉద్యోగులకు జీతాలు పెంపు

  • ‘104’, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందికి కూడా..

  • ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

  • టెక్కలి రూరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అత్యవసర వేళ ఆపద్బాంధవులుగా సేవలందిస్తున్న 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అలాగే కొత్తగా చేరి.. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది. దీంతోపాటు కొత్త వాహనాలు సమకూర్చింది. దీంతో ఉద్యోగులు, సిబ్బందిలో హర్షం వ్యక్తమవుతోంది.

  • వైసీపీ హయాంలో 108 అంబులెన్స్‌ వాహనాల నిర్వహణను పట్టించుకోలేదు. జిల్లాలో గతంలో 108, 104 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల నిర్వహణను అరబిందో సంస్థ నిర్వహించేది. ఒక్కో ఉద్యోగికి రెండు నెలల వేతనం, ఇంక్రిమెంట్లు, సెలవులకు సంబంధించి రూ.60వేల నుంచి రూ.90వేలు చొప్పున బకాయి ఉంది. సకాలంలో జీతాలు కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించింది. భవ్య అనే కొత్త సంస్థకు నిర్వహణ బాధ్యత అప్పగించింది. గతంలో రూ.2వేలు చొప్పున వేతనాలు పెంచింది. తాజాగా కొత్త వాహనాలతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు మరోసారి పెంచింది.

  • జిల్లాలో ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు 30 ఉన్నాయి. అదనంగా మరో మూడు వాహనాలు సమకూర్చారు. 104 వాహనాలు మండలానికి ఒకటి చొప్పున ఉంది. వీటితోపాటు సీహెచ్‌సీలో తల్లీబిడ్డల వాహనాలు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్‌ వాహనాలకు సంబంధించి 270 మంది సిబ్బంది ఉన్నారు. 104 వాహనాలతోపాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. గతంలో ప్రతినెల పైలట్‌కు రూ.18వేలు జీతం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.23వేలు జీతం వస్తోంది. గతంలో ఈఎంటీకి రూ.20వేలు ఉండగా.. దానిని రూ.25వేలకు పెంచారు. పెంచిన జీతాలు ఈ నెలలో బ్యాంకు ఖాతాలో జమకావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో 108 వాహన ఈఎంటీలు, పైలెట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఐదు నుంచి పదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి శ్లాబ్‌ అప్‌గ్రెడేషన్‌ చేయడంపై హర్షం వెలిబుచ్చారు. మెళియాపుట్టిలో కూడా సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పైలెట్లు బి.శేఖర్‌, ఆనంద్‌, విశ్వనాథం, ఈఎంటీలు సూర్యనారయణ, ఉపేంద్ర, సరోజిణి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 11:40 PM