Share News

రైల్వే ప్రయాణికులకు సురక్షిత తాగునీరు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:49 PM

రైల్వేస్టేషన్లతో పాటు సిబ్బంది గృహసముదాయాల వద్ద పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

రైల్వే ప్రయాణికులకు సురక్షిత తాగునీరు

- పారిశుధ్యం నిర్వహణకు కూడా ప్రాధాన్యత

- రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి

పలాస, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్లతో పాటు సిబ్బంది గృహసముదాయాల వద్ద పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమవుతోంది. విశాఖ డివిజన్‌లోని ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వరకూ ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో ఈ కార్యక్రమం త్వరలోనే అమలుకానుంది. ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, నీటి ట్యాంకులు, ఫిల్టర్లు శుభ్రపరిచి క్రిమిసంహారక చర్యలు చేపట్టనున్నారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నీటిశుద్ధి ప్లాంట్లు, భూగర్భ, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పీవీసీ ట్యాంకులు, వాటర్‌బూత్‌లు, కుళాయిలు, నీటి పంపిణీ కేంద్రాలను సమగ్రమంగా తనిఖీ చేయనున్నారు. ఓవర్‌ హెడ్‌ట్యాంకులు ఉన్న ప్రాంతాల్లో పక్షులు, జంతువుల నుంచి రక్షణ కల్పించేందుకు తగిన భద్రత తీసుకోనున్నారు. దెబ్బతిన్న ట్యాంకులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నారు. అదనంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు సంబంధించి అమృతభారత్‌ రైల్వేస్టేషన్లగా గుర్తించిన ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్‌లో పనులు వేగవంతం చేయడానికి, అన్ని ప్లాట్‌ఫారాల్లో ప్రయాణికులకు తాగునీటి వ్యవస్థ అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:49 PM