‘సదరం’ శిబిరాలు ప్రారంభం
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:59 PM
దివ్యాంగులకు వైకల్యాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షలకు (సదరం) ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. గతంలో జరిగిన అక్రమాలకు కళ్లెం వేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో అక్రమాలకు కళ్లెం
నరసన్నపేట, మార్చి 31(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు వైకల్యాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షలకు (సదరం) ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. గతంలో జరిగిన అక్రమాలకు కళ్లెం వేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఏరియా ఆసుపత్రుల్లో ‘సదరం’ శిబిరాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్తగా దివ్యాంగుల గుర్తింపు పత్రాల కోసం గత నెల 25న సచివాలయాల్లో స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. మూడు నెలల పాటు ప్రతి సోమ, మంగళవారాల్లో సర్వజన ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలలో సదరం శిబిరాలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఆరు రకాలైన వ్యాధులకు అవకాశం ఇవ్వడంతో వారంతా స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. వీరికి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎక్కువగా పక్షవాతంతో బాధ పడేవారు స్లాట్లు బుక్ చేసుకున్నారు. కొత్తగా సుమారు 11 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వీరికి మూడు నెలల పాటు నిర్ణయించిన రోజున పరీక్షలు చేసి.. అంగవైకల్య శాతాన్ని నిర్ధారిస్తారు. స్పెషలిస్టు వైద్యులు పరీక్షించి...అక్కడికక్కడే కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 40 మంది శారీరక దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎక్కువగా పక్షవాతం బారిన పడిన వారితో పాటు ప్రమాదాల్లో అంగవైకల్యానికి గురైన వారు ఉన్నారు.
సౌకర్యాలు లేక అవస్థలు
సదరం శిబిరాలను నిర్వహించే ఆసుపత్రుల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శారీరక అంగవైకల్యం గల వారు ఒంటటరిగా వచ్చేందుకు వీలుపడక వేరొకరి సాయంతో వస్తారు. వీరు కూర్చునేందుకు కనీసం బల్లలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నేలమీదనే కూర్చొని నిరీక్షిస్తున్నారు.