మృత్యువులా దూసుకొచ్చి..
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:15 AM
Lorry plows through; 32 sheep killed జాతీయ రహదారిపై గొర్రెలమంద, కాపరులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలాస మండలం శాసనం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గొర్రెల మందపైకి వెళ్లిన లారీ
32 మూగజీవాలు మృతి..
మరో 24 గొర్రెలకు తీవ్ర గాయాలు
ఇద్దరు కాపర్లకు గాయాలు
శాసనం గ్రామం వద్ద సంఘటన
పలాస, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై గొర్రెలమంద, కాపరులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలాస మండలం శాసనం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలాస మండలం కేశుపురానికి చెందిన సందక పాపారావు, టొంప పోలయ్య, ముక్తాపురానికి చెందిన గుమ్మడి హరికృష్ణ, జర్రిబధ్రకు చెందిన పిట్ట సింహాచలం, అమలుకుడియా గ్రామానికి చెందిన ముడిమించి పాపారావు, జడ్యాడ గ్రామానికి రాపాక రమణ గొర్రెలు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా సుమారు 300 గొర్రెలను పలాస మండలంలో మేతకు తిప్పుకుని ఇంటికి బయల్దేరారు. శుక్రవారం అర్ధరాత్రి శాసనం వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఓ లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి.. దూసుకెళ్లిపోయింది. దీంతో 32 గొర్రెలు చనిపోయాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల కాపరి హరికృష్ణతోపాటు మరొకరు గాయపడ్డారు. క్షతగ్రాతులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హరికృష్ణను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు.
గొర్రెలమందను ఢీకొన్న తరువాత లారీ నిలుపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. మిగిలిన గొర్రెలకాపర్లు వెంబడించడంతో లక్ష్మిపురం టోల్‌ప్లాజా వద్ద లారీని నిలిపి.. పరారయ్యాడు. కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఆత్మ పీడీ డాక్టర్ మట్ట రవికృష్ణ, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ బి.గణపతిరావు, ఏడీ డాక్టర్ బమ్మిడి యోగీశ్వరరావు, పశువైద్యులు ప్రియాంక, అజయ్‌తో పాటు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 32 గొర్రెలు మృతి చెందాయని, 24 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. రూ.10లక్షల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, గాలి కృష్ణారావు, దడియాల నర్సింహులు గొర్రెల కాపరులను ఓదార్చారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు ఫోన్‌లో వివరించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.