Share News

గోతిలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:24 AM

ఉదయం 11.30 గంటల సమయం. కోవిలాం కాలనీ మీదుగా ఆర్టీసీ బస్సు వెళుతోంది.

 గోతిలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు
రోడ్డు పక్కకు ఒరిగిపోయిన బస్సు

  • డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ముప్పు

ఎల్‌ఎన్‌ పేట, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఉదయం 11.30 గంటల సమయం. కోవిలాం కాలనీ మీదుగా ఆర్టీసీ బస్సు వెళుతోంది. ఇంతలో ఒక్కసారిగా బస్సు నుంచి హాహాకారాలు . ఏమైందోనని సమీపంలో ఉన్నవారు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి హతాశులయ్యారు. ఆ తరువాత తేరుకున్నారు. కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలివీ.. శ్రీకాకుళం 2వ డిపో నుంచి కొత్తూరు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లక్ష్మీనర్సుపేట జంక్షన్‌ సమీపంలోని కోవిలాం కాలనీ వద్దకు వస్తోంది. ఎదురుగావస్తున్న వాహనాన్ని తప్పించేందుకు డ్రైవరు బస్సును కుడివైపునకు తిప్పారు. దీంతో బస్సు రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఉద్దానం ప్రాజెక్టు పైపులైను వేసేందుకు తీసిన గొయ్యిని మట్టితో కప్పినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కూరుకుపోయింది. దీన్ని గమనించని డ్రైవర్‌ అటువైపు బస్సును తిప్పారు. ఆ పక్కనే విద్యుత్‌ స్తంభం ఉంది. పొరపాటున స్తంభానికి ఢీకొంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవ ర్‌ వెంకటరావు చాకచక్యంగా వ్యవహరించి... స్తంభానికి తగలకుండా బస్సును నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయానికి బస్సులో 80 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో బస్సులో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:24 AM