Share News

వ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:08 AM

విశాఖపట్నంలో నిర్వహించనున్న డీఎస్సీ ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ఆరుగురు ఉపాధ్యాయులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు.

వ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆసుపత్రిలో ఉపాధ్యాయులకు చికిత్స

ఆరుగురు ఉపాధ్యాయులకు గాయాలు

డీఎస్సీ ఆత్మగౌరవ సభకు వెళ్తుండగా ప్రమాదం

పలాస, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నిర్వహించనున్న డీఎస్సీ ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ఆరుగురు ఉపాధ్యాయులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి గ్రామం వద్ద చోటుచేసుకుంది. భరిణికోట పాఠశాలలో పని చేస్తున్న సవర గోపాల్‌, జె.మోసెస్‌క్రిష్టఫర్‌చక్రవర్తి, పెద్దమడి పాఠశాలకు చెందిన ఎం.హేమసుందర్‌, టీజీటీలుగా పనిచేస్తున్న కమ్మకట్ట రాజు, జామి సాయికళ్యాణి, కవిటి మండలం కరాపాడుకు చెందిన తట్టి భాస్కరరావు విశాఖలో జరిగే డీఎస్సీ ఆత్మగౌరవ సభకు బయలుదేరారు. వీరంతా కాశీబుగ్గలో వ్యాన్‌ ఎక్కారు. టెక్కలి వెళ్లి అక్కడ బస్సులో విశాఖ వెళ్లాల్సి ఉంది. అయితే వారు వ్యాన్‌ ఎక్కిన పది నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని రాంగ్‌రూటులో వచ్చిన ఆర్టీసీ డీలక్స్‌ బస్సు బలంగా ఢీకొంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు తల, చేతులపై నుంచి రక్తకారడంతో ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వ్యాన్‌ దిగి బయటకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్సు బ్రేకులు వేయకపోతే భారీ ప్రమాదం జరిగిఉండేదని బాధిత ఉపాధ్యాయులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 01:08 AM