Share News

రూ.3,300 కోట్లు.. 54 ఫ్లైఓవర్లు

ABN , Publish Date - May 03 , 2026 | 12:10 AM

Flyovers to replace railway gates జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ల పనుల్లో కదలిక వచ్చింది. నీలావతి గ్రామం రహదారిలో రైల్వే ఫ్లైఓవర్‌ పనులకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శుక్రవారం భూమిపూజ చేశారు. మిగతా ఫ్లైఓవర్ల పనులు చేపట్టి సకాలంలో పూర్తయితే ప్రజల కష్టాలు తీరినట్లే.

రూ.3,300 కోట్లు.. 54 ఫ్లైఓవర్లు
పలాస ఎల్‌సి గేటు వద్ద వాహనాల రద్దీ.

  • జిల్లాలో అన్నీ రైల్వేగేట్ల స్థానంలో బ్రిడ్జిలకు శ్రీకారం

  • రెండేళ్లలో పూర్తిచేయడమే లక్ష్యంగా..

  • మూడో రైల్వేలైన్‌కు మార్గం సుగమం చేస్తున్న అధికారులు

  • పలాస, మే 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ల పనుల్లో కదలిక వచ్చింది. నీలావతి గ్రామం రహదారిలో రైల్వే ఫ్లైఓవర్‌ పనులకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శుక్రవారం భూమిపూజ చేశారు. మిగతా ఫ్లైఓవర్ల పనులు చేపట్టి సకాలంలో పూర్తయితే ప్రజల కష్టాలు తీరినట్లే. అన్ని రైల్వేగేట్ల స్థానంలో శాశ్వత పరిష్కారం దిశగా రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.3,300 కోట్లతో జిల్లాలో ఏకంగా 54 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనుంది. మరోవైపు మూడో రైల్వేలైన్‌ వేయడంతోపాటు హైస్పీడ్‌ రైళ్లను కూడా నడిపేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో జిల్లావాసులకు రైల్వేసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

  • ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ కేంద్రంగా ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పలాస నుంచి విశాఖపట్నం వరకూ రైల్వేస్టేషన్లు విజయవాడ జోన్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏకంచేస్తూ విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌కోస్టు రైల్వేకు కేంద్రరైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖుర్ధారోడ్‌, వాల్తేర్‌ డివిజన్‌లు సంయుక్తంగా జిల్లాలో అన్నీ ఎల్‌సీ గేట్లు ఎత్తివేయడానికి చర్యలు తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరం ఉన్న చోట ఫ్లైఓవర్లు, అండర్‌ పాసేజీలు ఏర్పాటు చేసింది. అండర్‌పాసేజీల వల్ల తీవ్ర ఆటంకాలు ఉన్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. వర్షాకాలంలో 90 శాతానికి పైగా అండస్‌పాసేజీలు ఎందుకూ పనికిరావని గుర్తించింది. దీంతో ఎల్‌సీ గేట్లు ఉన్న స్థానంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండు డివిజన్ల అధికారులతో సమన్వయం చేసుకొని డీపీఆర్‌లు తయారు చేసింది. జిల్లాలో మొత్తం 54 ఫ్లైఓవర్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికోసం రూ.3300 కోట్ల నిధులు వెచ్చించడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించింది. దశలవారీగా టెండర్లకు ఆమోదం తెలిపింది. మొదటి దశలో మొత్తం 17 ఫ్లైఓవర్లు, రెండో దశలో మిగిలినవి చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా పలాస రెవిన్యూ డివిజన్‌లో ఉన్న తాళభద్ర, నీలావతి, బాలిగాం, పాలవలస, కరాపాడులో రైల్వేఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెండర్లు పిలిచిన వాటిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం శంకుస్థాపన చేశారు.

  • ఈ విషయమై ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ ముఖ్యకార్యనిర్వహణ అధికారి విక్టర్‌జోషెప్‌ వద్ద ప్రస్తావించగా.. ‘శ్రీకాకుళం జిల్లాలో 54 రైల్వే ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మొత్తం రూ.3,300 కోట్ల మేరకు రైల్వేశాఖ నిధులు వెచ్చిస్తుంది. వీటిని రెండేళ్లలో పూర్తి చేస్తాం. భవిష్యత్‌లో రైల్వేగేట్లు వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామ’ని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 12:10 AM