Share News

రూ.10 బాదంమిల్క్‌.. ఎంతపని చేసిందీ?

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:38 AM

80 people fall ill in two villages శ్రీకాకుళం నగరంలో ఇటీవలే డయేరియా ప్రబలి ఎంతోమంది ఆసుపత్రిపాలయ్యారు. ఒకరు చనిపోయారు కూడా. ఈ వ్యవహారంలో ఒక అధికారిపై వేటు కూడా పడింది. సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్‌ అయ్యారు. ఈ ఘటన మరువకముందే శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామంలో బాదంమిల్క్‌ తాగి 80 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు.

రూ.10 బాదంమిల్క్‌.. ఎంతపని చేసిందీ?
సింగుపురం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రోగులు..

  • తాగిన వారికి వాంతులు, విరేచనాలు, జ్వరం

  • రెండు గ్రామాల్లో 80 మందికి అస్వస్థత

  • బాధితులకు సింగుపురం పీహెచ్‌సీలో చికిత్స

  • ఫోన్‌లో ఆరా తీసిన మంత్రి అచ్చెన్నాయుడు

  • మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

  • రూ.10కే బాదంమిల్క్‌ అంటే అందరూ ఎగబడి తాగారు. అదే వారి కొంప ముంచింది. ఇంటికి వెళ్లాక కడుపులో గడబిడ మొదలైంది. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జ్వరం. స్థానికంగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లకు పరుగులు తీశారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసి.. బాధితులను సింగుపురం పీహెచ్‌సీకి తరలించారు. రెండు గ్రామాల్లో 80 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ పీహెచ్‌సీకి వెళ్లి వారిని పరామర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

  • శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో ఇటీవలే డయేరియా ప్రబలి ఎంతోమంది ఆసుపత్రిపాలయ్యారు. ఒకరు చనిపోయారు కూడా. ఈ వ్యవహారంలో ఒక అధికారిపై వేటు కూడా పడింది. సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్‌ అయ్యారు. ఈ ఘటన మరువకముందే శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామంలో బాదంమిల్క్‌ తాగి 80 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగుపురంలో రెండు రోజుల క్రితం గ్రామదేవత జాతర వైభవంగా జరిగింది. మామిడివలస ప్రజలు కూడా జాతరకు వచ్చారు. కొందరు వ్యాపారులు బండ్లపై బాదం పాలు విక్రయించారు. మొదట గ్లాసు రూ.30కి అమ్మిన వారు.. ఆతర్వాత ధరను రూ. 10కి తగ్గించేశారు. తక్కువ ధరకు వస్తుండటంతో చాలామంది తాగారు. వీరందరికీ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్ర జ్వరం, ఆపై వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి.

  • క్లినిక్‌లకు పోటెత్తిన రోగులు..

  • అస్వస్థతకు గురైన వారు హుటాహుటిన సింగుపురంలోని నాలుగు ఆర్‌ఎంపీ క్లినిక్‌లకు వెళ్లారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఒక్కో క్లినిక్‌కు 20 మందికి పైగా క్యూ కట్టారు. ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకుని, అక్కడ ఉండలేక ఇళ్లకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మామిడివలసలోనూ ఇవే లక్షణాలతో 15 మంది ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను మూసివేయించి, బాధితులను సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆరుగురు, రాత్రి మరో పదిమంది పీహెచసీలో చికిత్స పొందారు. మామిడివలసలో నలుగురికి డీహైడ్రేషన్‌ అయి పరిస్థితి విషమించడంతో వారిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సింగుపురం పీహెచ్‌సీకి వెళ్లారు. అదనపు వైద్యులు, సిబ్బందిని రప్పించారు. కలెక్టర్‌ రోగులను పరామర్శించారు.

  • మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

  • మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం రాత్రి కలెక్టర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. ఫుడ్‌పాయిజన్‌ వల్లనే ఇలా జరిగిందని.. పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్‌ మంత్రికి వివరించారు. ‘ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 12:38 AM