Share News

వంశధార ఎడమ కాలువకు రూ. 9.8 కోట్లు

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:11 PM

వంశధార ప్రాజెక్టు కాలువలకు మోక్షం లభించింది. బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువతో పాటు ఇతర బ్రాంచ్‌ కాలువల ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ. 9.8 కోట్లు మంజూరు చేసింది.

   వంశధార ఎడమ కాలువకు రూ. 9.8 కోట్లు
వంశధార ఎడమ ప్రధాన కాలువ

-పాలనాపరమైన అనుమతులు ఇస్తూ జీవో జారీ

-12 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు

-సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టు కాలువలకు మోక్షం లభించింది. బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువతో పాటు ఇతర బ్రాంచ్‌ కాలువల ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ. 9.8 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, రైతుల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

చివరి ఆయకట్టుకూ సాగునీరు

ఈ నిధులతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు 24ఏఆర్‌ డిస్ట్రిబ్యూటరీ(నరసన్నపేట బ్రాంచ్‌ కెనాల్‌), 25 ఆర్‌ డిస్ట్రిబ్యూటరీ (మేఘవరం బ్రాంచ్‌ కెనాల్‌) అభివృద్ధి పనులను కూడా చేస్తారు. తద్వారా ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు.

వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టు పూర్తి: అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి

కాలువ పనులు పూర్తయితే 12 మండలాల పరిధిలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రెండు సీజన్ల పాటు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jun 24 , 2026 | 11:11 PM