Share News

తొమ్మిది నెలల్లో రూ.142కోట్లు

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:08 AM

Increased revenue from the Department of Mines గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ శాఖ ఖజానా కళకళలాడుతోంది. లక్ష్యం కన్నా ఎక్కువ ఆదాయం సమకూరడంతో ఆ శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తొమ్మిది నెలల్లో రూ.142కోట్లు

పెరిగిన గనుల శాఖ ఆదాయం

వైసీపీ సర్కారులో గ్రానైట్‌ వ్యాపారులకు ఇబ్బందులు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మారిన పరిస్థితి

ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తున్న వైనం

తెరుచుకుంటున్న క్వారీలు, పాలిష్‌ యూనిట్లు

టెక్కలి రూరల్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ శాఖ ఖజానా కళకళలాడుతోంది. లక్ష్యం కన్నా ఎక్కువ ఆదాయం సమకూరడంతో ఆ శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలర్‌ గ్రానైట్‌కు జిల్లా పెట్టింది పేరు. 18మండలాల్లో గ్రానైట్‌ నిక్షేపాలు అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీనరేజ్‌ వసూళ్ల కాంట్రాక్ట్‌ను ఓ ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీతోపాటు కొందరు వైసీపీ నేతల వేధింపులను తట్టుకోలేక చాలామంది లీజుదారులు గ్రానైట్‌ క్వారీలను మూసివేశారు. కొంతమంది వైసీపీ నాయకులకు చెందిన గ్రానైట్‌ క్వారీలు మాత్రమే పని చేసేవి. వారు గత ప్రభుత్వానికి ఫీజులు చెల్లించకపోవడంతో గనుల శాఖ ఆదాయం పూర్తిగా పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు వారికి రాయితీలు ఇస్తోంది. దీంతో ప్రస్తుతం గ్రానైట్‌ వ్యాపారం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన లీజ్‌ దరఖాస్తులను సైతం అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. స్థానిక నాయకుల నుంచి కూడా ఇబ్బందులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పలువురు జిల్లాకు వచ్చి గ్రానైట్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో మూతపడిన పాలిస్‌ యూనిట్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఇక్కడ వ్యాపారం చేయలేక ఒడిశా వెళ్లిన వ్యాపారులు కూడా మళ్లీ తిరిగొస్తున్నారు. దీంతో గనులశాఖ ఆదాయం పెరుగుతోంది. తొమ్మిది నెలల్లో (2025 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు) రూ.142కోట్లు ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.

గతంతో పోల్చుకుంటే..

గనుల శాఖకు గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆదాయం పెరిగింది. జిల్లాలో కలర్‌ గ్రానైట్‌కు 131 చోట్ల లీజ్‌లు ఇచ్చారు. 1134.151 హెక్టార్లలో తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రానైట్‌ కటింగ్‌, పాలిష్‌ యూనిట్లు 155 ఉన్నాయి. స్టోన్‌క్రషర్లు 107, కంకర కొండలు 9, ఇసుకరీచ్‌లు పది వరకు ఉన్నాయి. వీటి ద్వారా గనులశాఖకు ఆదాయం వస్తుంది. 2019-20లో రూ.67.68 కోట్లు, 2020-21లో రూ.110 కోట్లు, 2021-22లో రూ.133 కోటు, 2022-23లో రూ.158 కోట్లు, 2023 - 24లో రూ.143 కోట్లు ఆదాయం గనుల శాఖకు వచ్చింది. 2024-25లో 87.58 కోట్లు, 2025 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రూ.99 కోట్ల లక్ష్యంగా కాగా రూ.142 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. మరో మూడు నెలలకు గాను ఇంకో రూ.10 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పాటు జరిమానాతో గతేడాది ఆగస్టు వరకు రూ.26.92లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వానికి ఆదాయం లేదు. గత వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికంగా ఇసుక విక్రయాలు చేపట్టింది. కానీ, ఆదాయం మాత్రం రాలేదని చెప్పేది. ఇప్పుడు వచ్చిన ఆదాయం అప్పుడు ఎందుకు రాలేదో, అది ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆ సర్కారుకే తెలియాలి.

ఇబ్బందులు లేకుండా వ్యాపారం

వైసీపీ ప్రభుత్వంలో వేధింపుల కారణంగా టెక్కలి ప్రాంతంలో చాలా క్వారీలను వ్యాపారులు మూసివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆ క్వారీలను తెరుస్తున్నారు. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా, వారికి కావాలసిన రాయితీలు ఇస్తుండడంతో వ్యాపారం పెరిగింది. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కూడా పెరిగింది. కొంతమంది కార్మికులతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతోంది.

- బగాది శేషగిరావు, ఏఎంసీ చైర్మన్‌, కోటబొమ్మాళి

Updated Date - Jan 07 , 2026 | 12:08 AM