Share News

రూ.14 లక్షలు మింగేశారు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:18 AM

Sanitation workers' salaries have been slashed నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాలు పక్కదారి పట్టాయి. విధుల్లో ఉన్నది 45 మంది అయితే.. 63 మందికి వేతనాలు చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు.

రూ.14 లక్షలు మింగేశారు
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

  • పారిశుధ్య కార్మికుల వేతనాలు పక్కదారి

  • 45 మంది విధులు.. 63 మందికి చెల్లిస్తున్నట్టు లెక్కలు

  • రెండేళ్లలో శానిటేషన్‌ నిధులు కాజేసిన వైనం

  • న్యాయం చేయాలని కలెక్టరేట్‌ వద్ద బాధితుల ఆందోళన

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాలు పక్కదారి పట్టాయి. విధుల్లో ఉన్నది 45 మంది అయితే.. 63 మందికి వేతనాలు చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు. అలాగే గత రెండేళ్లలో శానిటేషన్‌ కిట్లు, దుస్తులు, నూనె, సబ్బులు చెల్లింపు పేరిట సుమారు రూ.14లక్షలు స్వాహా అయ్యాయని పారిశుధ్య కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా గురువారం కలెక్టరేట్‌ వద్ద తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేశారు.

  • నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు, ఇతర ఖర్చులకు ఏటా రూ.1.20కోట్లు చెల్లిస్తారు. వీటిలో సుమారు 40 శాతం నిధులు పారిశుధ్య కార్మికుల పేరుతో పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో గత పంచాయతీ కార్యదర్శులతోపాటు పాలకవర్గంలో కొంతమంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. చెత్తను సేకరించే ట్రాక్టరు పేరుతో కూడా ఒక వ్యక్తికి భారీస్థాయిలో అద్దె చెల్లిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

  • 2025-2026లో పారిశుధ్య కార్మికులకు శానిటేషన్‌ సామగ్రి, దుస్తులు, చెప్పుల కోసం రూ.14,76,100 ఖర్చు చేసినట్టు లెక్క చూపారు. కానీ రూ.4,48,400 మాత్రమే ఖర్చు చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 63 మంది పారిశుధ్య కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో 45 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇలా ప్రతినెలా సుమారు రూ.3లక్షలు వరకు స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గతంలో పన్నుల ఫిక్సింగ్‌, వసూళ్లలో కూడా సిబ్బంది రూ.లక్షల్లో చేతివాటం చూపించారనే విమర్శలు ఉన్నాయి.

  • నిధులు స్వాహా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పారిశుధ్య కార్మికులు రెండు రోజులు విధులు బహిష్కరించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. స్వాహా చేసిన సొమ్మును తమకు ఇప్పించేవారకు విధుల్లోకి చేరేది లేదని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యాక్రమంలో పారిశుధ్య కార్మికులు పి.శంకరరావు, ఎన్‌.శ్రీను, ఎం.ప్రసాద్‌, బి.కాంతారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:18 AM