వ్యవసాయానికి రూ.11,392 కోట్లు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:17 AM
Finalization of the loan plan జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి రుణ ప్రణాళిక సిద్ధమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన రంగాలకు మరింత ఊతమిచ్చేలా.. రూ.19,735.42 కోట్ల అంచనాతో కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు.
ఎంఎస్‌ఎంఈకి రూ.2,776.61 కోట్లు కేటాయింపు
రూ. 19,735 కోట్లతో 2026-27 రుణ ప్రణాళిక ఖరారు
గత ఏడాదితో పోలిస్తే 26.70 శాతం వృద్ధి
లక్ష్యాలను వంద శాతం సాధించాలి: జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి రుణ ప్రణాళిక సిద్ధమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన రంగాలకు మరింత ఊతమిచ్చేలా.. రూ.19,735.42 కోట్ల అంచనాతో కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు, విద్యార్థులు, గృహ నిర్మాణ లబ్ధిదారులకు తగిన ఆర్థిక సాయం అందుతుందని అధికారులు తెలిపారు.
రూ. 4 వేల కోట్లకు పైగా..
గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రుణ ప్రణాళిక రూ. 15,576.44 కోట్లు కాగా, ఈసారి రూ. 19,735.42 కోట్లకు చేరింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రూ. 4,158.98 కోట్లు (26.70 శాతం) అదనంగా పెరిగింది. ఇందులో ప్రాధాన్య రంగాలకు 74.67 శాతం, ప్రాధాన్యేతర రంగాలకు 25.33 శాతం కేటాయించారు.
రైతులకు సింహభాగం.. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం..
ఎప్పటిలాగే వ్యవసాయ రంగానికే అత్యధిక కేటాయింపులు దక్కాయి. గత ఏడాదితో పోలిస్తే వ్యవసాయ రుణాల్లో 36.54 శాతం వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 2,776.61 కోట్లు కేటాయించారు. ఈ రంగంలో అత్యధికంగా 53.04 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.
సమన్వయంతో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్
సకాలంలో సంస్థాగత రుణాలను అందించడం ద్వారా వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈల పురోగతితో పాటు గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఇతర భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన రంగాల వారీగా కేటాయింపులు.. (రూ. కోట్లలో)
విభాగం కేటాయింపు వృద్ధి (గత ఏడాదితో)
వ్యవసాయ రంగం (మొత్తం) 11,392.62 36.54 శాతం
పంట రుణాలు 5,395.03 -
వ్యవసాయ టర్మ్ లోన్లు 4,698.32 -
పాడి, మత్స్య, కోళ్ల పెంపకం 1,171.98 -
వ్యవసాయ మౌలిక సదుపాయాలు 127.29 -
ఎంఎస్‌ఎంఈ రంగం (మొత్తం) 2,776.61 53.04 శాతం
సూక్ష్మ పరిశ్రమలు 1,722.44 -
చిన్న పరిశ్రమలు 649.09 -
మధ్య తరహా పరిశ్రమలు 350.79 -
ఇతర ప్రాధాన్య రంగాలు (మొత్తం) 566.21 15.59 శాతం
గృహ నిర్మాణం 215.60 -
విద్యా రుణం 61.78 -
పునరుత్పాదక ఇంధనం, ఇతరాలు 288.83 -
మొత్తం ప్రాధాన్య రంగాలు 14,735.44 -
ప్రాధాన్యేతర రంగాలు 4,999.98 51.51 శాతం
మొత్తం రుణ ప్రణాళిక 19,735.42 26.70 శాతం