Share News

పెన్షన్‌ ఫైల్‌కు రూ.పదివేలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:16 AM

MEO, data entry operator caught by ACB ఆయనో రిటైర్డ్‌ టీచర్‌. ఎంతోమందికి పాఠాలు బోధించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి ఆయన్ను కూడా ఆ అధికారి వదల్లేదు. పెన్షన్‌ ఫైల్‌ కదలాలంటే తనకు, ఆపరేటర్‌కు లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే ఇంచు కూడా కదలదన్నాడు. చివరకు ఆ ఇద్దరూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

పెన్షన్‌ ఫైల్‌కు రూ.పదివేలు
ఏసీబీకి పట్టుబడిన ఎంఈవో అప్పారావు, డేటాఎంట్రీ ఆపరేటర్‌ కామేష్‌

  • రిటైర్డ్‌ టీచర్‌ నుంచి లంచం డిమాండ్‌

  • ఏసీబీకి చిక్కిన ఎంఈవో, డేటాఎంట్రీ ఆపరేటర్‌

  • ఆయనో రిటైర్డ్‌ టీచర్‌. ఎంతోమందికి పాఠాలు బోధించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి ఆయన్ను కూడా ఆ అధికారి వదల్లేదు. పెన్షన్‌ ఫైల్‌ కదలాలంటే తనకు, ఆపరేటర్‌కు లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే ఇంచు కూడా కదలదన్నాడు. చివరకు ఆ ఇద్దరూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఇచ్ఛాపురం ఎంఈవో కురమాన అప్పారావు, డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఉప్పాడ కామేష్‌.. సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఇచ్ఛాపురం మండలం చెన్నుగానిపేట ఎంపీపీ హైస్కూల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేసిన వేజెండ్ల నిరీక్షణరావు గతేడాది డిసెంబరు 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆ పాఠశాలకు డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌ (డీడీవో)గా ఇచ్ఛాపురం ఎంఈవో కురమాన అప్పారావు వ్యవహరిస్తున్నారు. నిరీక్షణరావుకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, జీపీఎఫ్‌ తదితర ఉద్యోగ విరమణ ప్రయోజనాల పత్రాలను ఇచ్ఛాపురం సబ్‌-ట్రెజరీకి పంపాల్సిన బాధ్యత ఎంఈవోపైనే ఉంది. దీనికోసం అవసరమైన పత్రాలన్నీ గత నెల మొదటి వారంలో నిరీక్షణరావు ఎంఈవో అప్పారావుకు అందజేశారు. అయితే అదే డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఉప్పాడ కామేష్‌ను కలవాలని ఎంఈవో సూచించారు. ఈ మేరకు ఈ నెల 3న నిరీక్షణరావు.. కార్యాలయానికి వెళ్లి ఆపరేటర్‌ కామేష్‌ను కలిశారు. కాగా.. ఆ ఫైల్‌ కదిలి.. పని పూర్తికావాలంటే ఎంఈవోకు రూ.3వేలు, తనకు రూ.7 వేలు మొత్తంగా రూ.10వేలు లంచం ఇవ్వాలని కామేష్‌ డిమాండ్‌ చేశాడు. దానికి స్పందించకుండా ఆయన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఎంఈవో ఆ ఫైల్‌ను ట్రెజరీకి పంపకుండా పక్కన పెట్టేశారు. 15 రోజుల తర్వాత నిరీక్షణరావు మళ్లీ వెళ్లి ఆ ఇద్దరినీ కలిశారు. ఎంఈవో అప్పారావు.. తమ ఇద్దరికీ రూ.10వేలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వకుంటే ఫైల్‌ ట్రెజరీకి పంపబోమని తెలిపారు.

  • రంగంలోకి దిగిన ఏసీబీ...

  • లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు నిరీక్షణరావు శ్రీకాకుళం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్రణాళికతో సోమవారం ఏసీబీ అధికారులు వల పన్నారు. కార్యాలయంలోనే బాధితుడి నుంచి ఎంఈవో అప్పారావు రూ.3వేలు, ఆపరేటర్‌ కామేష్‌ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. నిందితుల ఇళ్లలో, అలాగే కార్యాలయంలోని వారి రూముల్లో సోదాలు చేపట్టారు. వారిద్దరిపై అవినీతి నిరోధక చట్టం 1988, సెక్షన్‌ 7ఏ కింద కేసు నమోదు చేశారు. వారిని విశాఖపట్నంలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే సంబంధిత జిల్లా ఏసీబీ అధికారులకు కానీ, ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064, లేదా మొబైల్‌ నంబర్‌ 94404400557కు తెలియజేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు. ‘‘కంప్లయింట్స్‌-ఏసీబీయట్‌దారేటాఫ్‌ఏపీ.జీఓవీ.ఇన్‌’’ మెయిల్‌ ఐడీ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

  • నిందితుల నేపథ్యం ఇదీ...

  • కురమాన అప్పారావు (ఎంఈవో) : 1996లో స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌)గా ఉద్యోగంలో చేరారు. 2009లో గ్రేడ్‌-2 హెచ్‌ఎంగా, 2017లో ఎంఈవోగా పదోన్నతి పొందారు. మార్చి 2017 నుంచి ఇచ్ఛాపురం ఎంఈవోగా పనిచేస్తున్నారు.

  • ఉప్పాడ కామేశ్వరరావు(ఆపరేటర్‌) : 2006లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్‌గా నియమితులై .. అప్పటి నుంచీ ఇచ్ఛాపురం ఎంఈఓ కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు.

Updated Date - Feb 24 , 2026 | 12:16 AM