వైసీపీ కార్యకర్త ఇంట్లో రూ.10లక్షలు స్వాధీనం
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:08 AM
Rs 10 lakh seized పలాసలో వైసీపీ కార్యకర్త పినకాన ముకుందరావు ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన నగదుగా ముకుందరావు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే తెచ్చారన్న అనుమానాలు
నగదును ఎన్నికల కమిషన్‌కు నివేదించి..
ఐటీ శాఖకు సమాచారం ఇస్తామన్న పోలీసులు
పలాస, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పలాసలో వైసీపీ కార్యకర్త పినకాన ముకుందరావు ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన నగదుగా ముకుందరావు చెబుతున్నారు. పలాసలోని వివేకానంద కాలనీలో ముకుందరావు నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంట్లో రూ.70 లక్షలు ఉన్నాయని, ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేశారని సామాజిక మాధ్యమాల్లో సోమవారం మధ్యాహ్నం ప్రచారం జరిగింది. దీంతో సోమవారం సాయంత్రం కాశీబుగ్గ సీఐ ఎం.అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచిన రూ.10 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి నగదును పలాస ఖజానాకు తరలించారు. అయితే సోదాల సమయంలో ముకుందరావుతోపాటు వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తప్పుడు ప్రచారాల ఆధారంగా ఇంట్లో సోదాలు చేయడం సరికాదని ప్రశ్నించారు. ముకుందరావు పలాస మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి బమ్మిడి దుర్యోధనరావుకు బంధువు. రాజకీయ విభేదాలతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై మంగళవారం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తామని డీఎస్పీ జీవీ రమణ తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ ఎం.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.