Share News

పాఠశాలకు రూ.కోటి విరాళం

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:24 PM

మండలంలోని దండుగోపాలపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వపు విద్యారి డాక్టర్‌ లమ్మత విశ్వనాథం తన దాతృత్వం చాటుకున్నారు.

పాఠశాలకు రూ.కోటి విరాళం
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ విశ్వనాథం

- పూర్వపు విద్యార్థి దాతృత్వం

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని దండుగోపాలపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వపు విద్యారి డాక్టర్‌ లమ్మత విశ్వనాథం తన దాతృత్వం చాటుకున్నారు. తను చదువుకున్న పాఠశాలకు రూ.కోటి విరాళాన్ని బుధవారం ప్రకటించారు. ఈ పాఠశాలలో 1966లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 60 ఏళ్ల తరువాత అపూర్వకలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన డాక్టర్‌ విశ్వనాథం (ఎండీ, ఎఫ్‌ఏసీసీ) అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన ఆత్మకథను ‘నా జీవన యానం కాళీపురంలో మొదలై..’ అనే పేరుతో పుస్తకాన్ని ఇదే పాఠశాలలో ఆయనతో చదువుకున్న చింతాడ కృష్ణారావు రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోత మహాలక్ష్మి అప్పన్న మెమోరియల్‌ సర్వీసు ఆర్గనైజేషన్‌ సంస్థ నిర్వహించగా, పుస్తకాన్ని ఎల్‌.ఎల్‌. నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విశ్వనాథం మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి తన వంతుగా ఒక కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నానని, ఈ మొత్తాన్ని ఆడిటోరియం నిర్మాణానికి వెచ్చించాలని కోరారు. దీంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కోత చిన్నబాబు, కార్యదర్శి కోత మధుసూదనరావు, ధర్మారావు, సతీష్‌, వాసు మాస్టర్‌, ప్రధానోపాధ్యాయుడు పిట్ట గంగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:24 PM