Share News

రెచ్చిపోతున్న రౌడీలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:42 AM

For atrocities, settlements జిల్లాలో నేరగాళ్లు, రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం, చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు యథేచ్ఛగా దౌర్జన్యాలకు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు.

రెచ్చిపోతున్న రౌడీలు

  • జిల్లాలో అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు

  • సెటిల్మెంట్లు, కాల్‌మనీ, దౌర్జన్యాలతో పాత నేరస్థుల బరితెగింపు

  • గంజాయి, పేకాట, పశువుల అక్రమ రవాణాలో తగ్గని జోరు

  • చోద్యం చూస్తున్న పోలీసులు

  • మొక్కుబడిగా ‘ఆదివారం కౌన్సిలింగ్‌’

  • భయం గుప్పిట్లో ప్రజలు

  • శ్రీకాకుళం/ క్రైమ్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి):

  • జిల్లాలో నేరగాళ్లు, రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం, చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు యథేచ్ఛగా దౌర్జన్యాలకు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. తాజాగా చోటుచేసుకుంటున్న ఉదంతాలు, పోలీసుల వద్ద ఉన్న అధికారిక గణాంకాలే.. రౌడీషీటర్ల అరాచకాలకు అద్దం పడుతున్నాయి.

  • ఆటో నడుపుతూనే హత్యల దాకా

  • విశాఖపట్నం నుంచి నగర బహిష్కరణకు గురైన ఓ రౌడీషీటర్‌ శ్రీకాకుళం జిల్లా రణస్థలాన్ని తన అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ ఆటో నడుపుతూ.. ఫోన్ల ద్వారా సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తన కదలికలపై పోలీసుల నిఘా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, గత నెలలో తన అనుచరులతో కలిసి మధురవాడ(విశాఖపట్నం) వెళ్లి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు.

  • కాల్‌మనీ కల్లోలం... కారులో అర్థనగ్నంగా

  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక రౌడీషీటర్‌ ఫైనాన్స్‌ వ్యాపారం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నాడు. నగరంలో ఓ యువకుడికి అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు. సకాలంలో అప్పు తీర్చలేదన్న నెపంతో, ఇటీవల ఆ యువకుడిని తన కారులో ఎక్కించుకుని రాత్రంతా అర్థనగ్నంగా తిప్పుతూ రాక్షసంగా హింసించాడు.

  • మొక్కుబడిగా కౌన్సిలింగ్‌

  • రౌడీషీటర్ల కార్యకలాపాలపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఆదివారం పోలీసు స్టేషన్లలో రౌడీషీటర్లకు నిర్వహించే కౌన్సిలింగ్‌ ఓ ప్రహసనంగా మారింది. ‘వచ్చామా, సంతకం పెట్టామా, వెళ్లామా’ అన్న రీతిలోనే ప్రక్రియ సాగుతోంది తప్ప.. వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీయడం లేదు. కౌన్సిలింగ్‌కు రాని వారిపై కనీసం విచారణ కూడా చేయడం లేదు. దీంతో రౌడీలకు భయం లేకుండా పోయింది. చాలామంది రౌడీషీటర్లు భూ వివాదాల్లో తలదూర్చడం, పేకాట స్థావరాలు నిర్వహించడం, సూట్‌ గేముల్లో డబ్బులు పోగొట్టుకున్న వారికి అక్కడికక్కడే అధిక వడ్డీలకు అప్పులిచ్చి వసూళ్లకు పాల్పడటం వంటివి నిర్భయంగా చేస్తున్నారు.

  • గంజాయి, పేకాట, పశువుల రవాణా...

  • జిల్లావ్యాప్తంగా 2,135 హిస్టరీ షీట్లు ఉండగా.. అందులో 704 రౌడీ షీట్లు, 1,431 సస్పెక్ట్‌ షీట్లు ఉన్నాయి. గతేడాది మొత్తం 394 కొత్త షీట్లు తెరవగా, ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే ఆ సంఖ్య 415కు చేరడం గమనార్హం.

  • గతేడాది భౌతికదాడులు, మహిళలపై అఘాయిత్యాలు తదితర కారణాలతో కొత్తగా 173 మందిపై (భౌతిక దాడులు-99, మహిళలపై నేరాలు-63, ఇతర-11) రౌడీషీట్లు తెరిచారు. ఇక ఈ ఏడాది మొదటి కొద్ది నెలల్లోనే 48 మందిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేశారు. ఇందులో భౌతిక దాడులు (24), మహిళలపై నేరాలకు (22) సంబంధించినవే కావడం ఆందోళనకరం.

  • దొంగతనాలు, ఆస్తి తగాదాలు, గంజాయి(ఎన్‌డీపీఎస్‌), సారా, పేకాట, పశువుల అక్రమ రవాణా చేసే వారిపై తెరిచే సస్పెక్ట్‌ షీట్ల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. గతేడాది 221 మందిపై సస్పెక్ట్‌ షీట్లు తెరవగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 367 మందిపై సస్పెక్ట్‌ షీట్లు తెరిచారు.

  • ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్‌ (ఎన్‌డీపీఎస్‌) కింద గతేడాది 105 మందిపై షీట్లు తెరిస్తే, ఈ ఏడాది అది 176కు చేరింది.

  • పేకాటకు సంబంధించి గతేడాది కేవలం 8 మందిపైనే షీట్లు తెరవగా, ఈ ఏడాది అది ఏకంగా 60కి చేరింది.

  • పశువుల అక్రమ రవాణా కింద గతేడాది కేవలం 2 షీట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా 57 మందిపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశమవుతోంది. ఇక ఆస్తి సంబంధిత నేరాల కింద గతేడాది 101, ఈ ఏడాది 74 షీట్లు నమోదయ్యాయి.

  • యువకుల పెడదారి

  • రౌడీషీటర్లు దౌర్జన్యాలు చేస్తూ, సెటిల్మెంట్ల ద్వారా అడ్డదారిలో రూ.లక్షలు సంపాదిస్తుండడంతో.. కొందరు యువకులు కూడా వారి బాట పడుతున్నారు. ఈజీ మనీ భ్రమలో పడి గొడవలు, సెటిల్మెంట్లలో తలదూర్చుతున్నారు. అసాంఘిక శక్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు భయపడుతుండటంతో వీరికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

  • నిఘా పెంచితేనే ఫలితం

    జిల్లాలో శ్రుతిమించుతున్న అరాచకాలను అరికట్టాలంటే పోలీసులు తమ పంథా మార్చుకోవాలి. కేవలం ఆదివారం ఒక గంట మాత్రమే కాకుండా.. ఉదయం నుంచీ సాయంత్రం వరకు కౌన్సిలింగ్‌ కొనసాగించాలి. అవసరమైతే రౌడీషీటర్ల ప్రవర్తనను బట్టి వారానికి రెండుసార్లు స్టేషన్‌కు పిలిపించాలి. నిఘా వ్యవస్తను పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలి. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న సెటిల్మెంట్లు, పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేయాలి. వీధుల్లో ఆకతాయిల దౌర్జన్యాలపై ఉక్కుపాదం మోపాలి. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి.. అసాంఘిక శక్తుల ఆటకట్టించాలని, శాంతిభద్రతలను గాడిన పెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:42 AM