Share News

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:24 AM

Security arrangements ‘స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ జిల్లా పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత
ఎస్పీ మహేశ్వరరెడ్డితో మాట్లాడుతున్న డీఐజీ గోపీనాథ్‌జెట్టీ

విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ

శ్రీకాకుళం క్రైం, అక్టోబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ జిల్లా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డితోపాటు పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్దత, నామినేషన్ల పరిశీలన, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, శాంతిభద్రతల పరిస్థితి, ముందస్తు నివారణా చర్యలపై సమీక్షించారు. డీఐజీ మాట్లాడుతూ.. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉండాలి. అవసరమైతే బైండోవర్‌ కేసులు నమోదు చేయాలి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఒడిశా నుంచి మద్యం అ క్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖతో సమన్వయం పనిచేయాలి. ఎన్నికలకు సంబంధించి తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాల’ని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్‌ ధనుంజయనాయుడు, డి.లక్ష్మణరావు, జి.వి.రమణ, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఇమ్మాన్యూల్‌రాజ్‌, ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సైబర్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:24 AM