రెప్పపాటులో ఘోరం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:39 AM
Car-lorry Dhee అతివేగం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామం జాతీయ రహదారి-16పై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇందులో సిక్కోలుకు సంబంధించి ఇద్దరి యువకులు ఉండ డంతో జిల్లాలో కూడా విషాదచాయలు అలుముకు న్నాయి.
కారు ఢీకొని సిక్కోలు యువకులు ఇద్దరు మృతి
అదే కారు లారీని ఢీకొన్న వైనం
డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి మృత్యువాత
పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద ఘటన
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ
గంగుపేటలో విషాదఛాయలు
విజయనగరం/దాసన్నపేట/ కోటబొమ్మాళి, ఏప్రి ల్ 28(ఆంధ్రజ్యోతి): అతివేగం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామం జాతీయ రహదారి-16పై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇందులో సిక్కోలుకు సంబంధించి ఇద్దరి యువకులు ఉండ డంతో జిల్లాలో కూడా విషాదచాయలు అలుముకు న్నాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివ రాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీ శారదనగర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కరుణాకరం శ్రీనివాస్(59), పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగిపేట మాజీ సర్పంచ్ కళ్యంపూడి సింహా చలం(48)తో మరోవ్యక్తి కారులో సోమవారం ఉదయం శ్రీకాకుళం వెళ్లారు. మరుసటి రోజు అక్కడి నుంచి విశాఖకు బయలుదేరారు. తిరిగి సోమవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కారుపై అతివేగంగా వస్తూ అదే సమయంలో పేరాపురం వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలో టీ తాగి రోడ్డు పక్కన మాట్లాడుతున్న శ్రీకాకుళం జిల్లా కోటబొ మ్మాళి మండలం చినసాన పంచాయతీ గంగుపేట గ్రామానికి చెందిన సదునుపల్లి రమేష్ (25), సదునుపల్లి రాము (28) అనే యువకులను ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ అక్క డికక్కడే వారు మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయాయి.
అదేసమయంలో కారు అంతే వేగంతో రోడ్డుపక్కన ఆగిఉన్న కంటైనర్ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీనివాస్ అక్కడకక్కడే మృతిచెందగా, కారు నడుపుతున్న సింహాచలం తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను పోలీసులు, స్థానికులు విజయనగరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ దామెదర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లారీ కింద ఇర్కుపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీయించారు. మృతదేహాలను విజయనగరం పెద్దాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ మణికుమార్, ఎంవీఐలు దుర్గాప్రసాద్, రవిశంకర్, వెంకటరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న స్పీడో మీటరును పరిశీలించి అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారనకు వచ్చారు. లారీ వెనుక టైర్లు బెండు కావడంతో ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని గుర్తించారు. కారుకు సంబంధించిన ఫిట్‌నెస్, ఇతర పత్రాలు, డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా? లేదని పరిశీలిస్తామని డీటీసీ మణికుమార్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మా పరిస్థితి ఏంటీ దేవుడా?
రమేష్‌కు భార్య నీలవేణి, 10 నెలల బాబు ఉన్నారు. రాముకు భార్య కస్తూరితో పాటు 10, 8 ఏళ్ల కుమార్తెలు దర్శిని, తేజేశ్వరి ఉన్నారు. రాము, రమేష్ సోమవారం ద్విచక్రవాహనంపై విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలియడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నాన్న ఎప్పటికీ రాడని తెలుసుకున్న రాము పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భర్తలు తెచ్చేకూలితో కుటుంబం గడిచేదని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటీ దేవుడా అంటూ మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
భయానకం..
రాత్రి సమయం కావడంతో రోడ్డుపక్కనే ఉన్న ఓ హోటల్‌లో తినేందుకు వెళ్లాను. ఇంతలోనే భారీ శబ్దం రావటంతో ఏం జరిగిందని బయటకు వచ్చాను. అప్పటికే రెండు మృతదేహాలు రక్తం కారుతూ చెల్లచెదురుగా పడిఉన్నాయి. కారులో డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పక్కసీట్లో ఉన్నవ్యక్తి తల పగిలి ఉన్నాడు. అప్పటికే ఆయన మృతి చెందడంతో భయందోళనకు గురయ్యాను.
-రెల్లి బలరాం, ప్రత్యక్ష సాక్షి, స్థానికుడు