Share News

బుస కొడుతున్నాయ్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:49 PM

Snakebite fatalities జిల్లాలో పాముకాటు మృతులు పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంట పొలాల్లోనే ఎక్కువగా పాముకాటుకు గురైన ఘటనలు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ 1,923 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములే ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

బుస కొడుతున్నాయ్‌

  • జిల్లాలో పెరుగుతున్న పాముకాటు బాధితులు

  • నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ముప్పు

  • ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీవినమ్‌ ఇంజక్షన్లు

  • రణస్థలం/నరసన్నపేట, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):

  • గత నెల 5న వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రకు చెందిన గూడ వల్లమ్మ రాత్రి పడుకునే సమయంలో తొడభాగంపై పాము కాటువేసింది. బాధితురాలిని వెంటనే పలాస ఆసుపత్రికి తరలించగా.. మరుసటి రోజు ఉదయం మృతి చెందింది.

  • గత నెల 8న లావేరు గ్రామానికి చెందిన తోలాపి లచ్చుం నీలగిరి తోటకు వెళ్లి అక్కడ పాముకాటుకు గురయ్యాడు. ఆయనను శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • గత నెల 10న నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి ఇంటర్‌ విద్యార్థి.. తన ఇంట్లో మేడమెట్లు ఎక్కుతుండగా పాము కాటేసింది. ఆ విద్యార్థికి సకాలంలో చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.

  • గత నెల 31న లావేరు మండలం రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె భవానీ పాముకాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 4న భవానీ మృతిచెందింది.

  • ఈ నెల 1న పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన దువ్వారపు నారాయణమ్మ పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది.

  • జిల్లాలో పాముకాటు మృతులు పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంట పొలాల్లోనే ఎక్కువగా పాముకాటుకు గురైన ఘటనలు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ 1,923 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములే ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. జిల్లాలోని 71 పీహెచ్‌సీలు, 13 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలో ఇప్పటివరకూ 518 మంది పాముకాటు బాధితులు చేరారు. ఒక్క జూలై నెలలోనే 180 మంది పాముకాటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రి, నరసన్నపేట ఏరియా ఆస్పత్రి, 13 సీహెచ్‌సీల్లో ఈ ఆరు నెలల్లో 1,405 కేసులు నమోదయ్యాయి. మే నెలలో 254 మంది, జూన్‌లో 322 మంది, జూలైలో 369 మంది పాముకాటున బారిన పడ్డారు. వర్షాకాలం వేళ.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పాముకాటుకు గురైన వెంటనే బాధితులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేస్తున్నారు.

  • వైద్యం అందక..మూల్యం

  • పాముకాటు వేసిన వెంటనే సకాలంలో వైద్యసేవలందక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘యాంటీ వీనమ్‌’ కొన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రిల్లో యాంటీవినమ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. అది మొదటి 5-10 డోసులకే పరిమితమవుతోంది. తరువాత బాధితులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాల్సి వస్తోంది. కొందరు పాముకాటు బాధితులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా, పూర్తిస్థాయి డోసులు పడక దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా పక్షవాతం, మెదడులో రక్తం గడ్డకట్టడం, అంధత్వం తలెత్తడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు గుండె, కాలెయం పనితీరుపై ప్రభావం చూపే రుగ్మతలకు గురవుతున్నారు. పాముకాటుకు గురైన బాధితుడికి మూడుగంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీవినమ్‌ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆపై దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, 104 వాహనాల్లో పూర్తిస్థాయిలో యాంటీవీనమ్‌ మందును అంబాటులో ఉంచితే పాముకాటు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు.

  • ఇవి చేయాలి

  • ఇంటి పరిసరాలను, పశువుల శాలలను శుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులు, ధాన్యం రాశులు, సంచులు తదితర వాటిలో మురుగు లేకుండా చూసుకోవాలి. పిల్లలను పుట్టల దగ్గర ఆటలు ఆడకుండా చూసుకోవాలి. రైతులు పొలాలకు వెళ్లినప్పడు చేతిలో కర్రతోపాటు వినికిడి శబ్దాలు చేసే పరికరాలు, టార్చిలైట్లు తమ వద్ద ఉంచుకోవాలి.

  • అప్రమత్తంగా ఉండాలి

  • పాముకాటు వేసిన మూడు గంటల్లోపు బాధితుడికి యాంటీవీనమ్‌ డోసు వేయాలి. తక్షణం ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. నాటు వైద్యం అత్యంత ప్రమాదకరం. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. బాధితుడు ధైర్యంతో ఉండాలి. పాముకాటు వేసిన వెంటనే తాడుతో గాయాన్ని కట్టి వేయాలి. ప్రభుత్వాస్పత్రిలో యాంటీ వీనమ్‌ డోసులు అందుబాటులో ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

  • - ఎన్‌.పద్మావతి, వైద్యాధికారి, రణస్థలం సీహెచ్‌సీ

  • సొంత వైద్యం వద్దు

  • పాటు కాటు వేసినప్పుడు నాటు మందులు వాడరాదు. మంత్రాలు, సొంత వైద్యం చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దు. పాము కరిచిన వెంటనే బాధితుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ప్రాణహాని లేకుండా ఉంటుంది.

    - సూరపు కృష్ణారావు, సూపరింటెండెంట్‌, ఏరియా ఆసుపత్రి, పాతపట్నం

Updated Date - Aug 10 , 2026 | 11:49 PM