కిలోకు రూ.100
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:09 AM
Cashew prices up by Rs. 100 per kg ధరలు లేక నష్టాల్లో కూరుకుపోయిన పలాస జీడిమార్కెట్ వినాయకచవితి సందర్భంగా ఊపందుకుంది. కిలో జీడిపప్పుపై రూ.వంద వరకూ ధర పెరగడంతో వ్యాపారుల్లో సంతోషం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ జీడిపప్పు అమ్మకాలు లేక పరిశ్రమలు బంద్ పాటించి ఉన్న నిల్వలు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో జీడిపప్పునకు గిరాకీ రావడంతో పలాస మార్కెట్‌పై వాటి ప్రభావం పడింది.
పెరిగిన జీడిపప్పు ధరలు
చురుగ్గా వ్యాపారలావాదేవీలు
పలాస, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ధరలు లేక నష్టాల్లో కూరుకుపోయిన పలాస జీడిమార్కెట్ వినాయకచవితి సందర్భంగా ఊపందుకుంది. కిలో జీడిపప్పుపై రూ.వంద వరకూ ధర పెరగడంతో వ్యాపారుల్లో సంతోషం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ జీడిపప్పు అమ్మకాలు లేక పరిశ్రమలు బంద్ పాటించి ఉన్న నిల్వలు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో జీడిపప్పునకు గిరాకీ రావడంతో పలాస మార్కెట్‌పై వాటి ప్రభావం పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో పండుగలకు జీడిపప్పును ఎక్కువగా వినియోగిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో దీపావళికి జీడిపప్పును బహుమతులుగా ఇచ్చే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం వరుస పండుగలు సమీపిస్తుండడంతో జీడిపప్పునకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఒకటో నెంబరు జీడిపప్పు కిలో రూ.850 ఉండగా.. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.950కి చేరింది. చిరువ్యాపారులు దీన్ని రూ.1000 వరకూ విక్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా జీడిపప్పు ఎగుమతులకు సానుకూలంగా ఉండడంతో పలాస జీడిని తరలిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 400 వరకూ జీడి పరిశ్రమలు ఉండగా, 25వేల మంది వరకూ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. పలాసలో భారీ జీడి పరిశ్రమలు ఐదు వరకూ ఉండగా మిగిలినవి రోజుకు 10 నుంచి 20 బస్తాలు పీలింగ్ చేస్తున్నాయి. పలాసలోని పారిశ్రామికవాడలో 40 వరకూ జీడి పరిశ్రమలు ప్రస్తుతం పని చేస్తున్నాయి. దీపావళి పండుగ వరకూ ఇవే ధరలు ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
కిలో జీడిపప్పు ధర ఇలా..
సైజు - రూపాయల్లో
180 - 950
210 - 830
240 - 790
జేహెచ్(పెద్ద బద్ద) - 750
కే(బద్ద) - 700