రిమ్స్‌కు ‘ప్రైవేటు’ రోగం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:14 AM
Inadequate services at the government hospital జిల్లా కేంద్రంలోని 930 పడకల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్) నిర్లక్ష్యం కోరల్లో చిక్కుకుంది. జిల్లావ్యాప్తంగా ఈ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 1600 ఔట్ పేషెంట్లు, 100 నుంచి 120 మంది ఇన్-పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ సగటున 15 మేజర్ ఆపరేషన్లు, 140 మైనర్ ఆపరేషన్లు, 6 ప్రసవాల వరకు జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్యుల సేవల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాయకుల అండతో వైద్యుల ఇష్టారాజ్యం
ప్రభుత్వ ఆస్పత్రిలో సక్రమంగా అందని సేవలు
సర్కారు జీతం తీసుకుంటూ సొంతక్లినిక్‌లకు..
రోగులకు తప్పని ఇబ్బందులు
శ్రీకాకుళం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని 930 పడకల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్) నిర్లక్ష్యం కోరల్లో చిక్కుకుంది. జిల్లావ్యాప్తంగా ఈ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 1600 ఔట్ పేషెంట్లు, 100 నుంచి 120 మంది ఇన్-పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ సగటున 15 మేజర్ ఆపరేషన్లు, 140 మైనర్ ఆపరేషన్లు, 6 ప్రసవాల వరకు జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్యుల సేవల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లో అత్యధిక మంది వైద్యులు ఆస్పత్రికి ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారని.. శ్రీకాకుళంలోని ప్రైవేటు ప్రాక్టీస్‌కే నిత్యం అతుక్కుపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కీలకంగా వ్యవహరించే డాక్టర్లు, స్పెషలిస్టులు కుల, సామాజిక వర్గాల ప్రాతిపదికన ప్రజాప్రతినిధులతో సాన్నిహిత్యం నెరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిమ్స్‌లో ఓ రేడియాలజిస్ట్, నగరంలోని ఓ ప్రైవేటు వైద్యుడికి అల్లుడు కావడం, ప్రజాప్రతినిధులతో పరిచయాలు ఉండటం ఆయనుకు కలిసివచ్చిందని ఆసుపత్రి వర్గాల్లో చర్చ జరుగుతోంది. డ్యూటీకి వెళ్లకుండా ప్రైవేటు ల్యాబ్‌లలో కాలం గడుపుతున్న సదరు రేడియాలజిస్ట్‌ను తప్పించాలని ఇటీవల భావించినప్పటికీ, ప్రజాప్రతినిధితో మామ ద్వారా చెప్పించుకుని వేటు పడకుండా చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి చర్యలు లేకపోగా, శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ల్యాబ్‌ను ఎంచక్కా నిర్వహిస్తూ, ప్రభుత్వ విధులకు ఎప్పుడు వెళ్తున్నాడో కూడా గగనమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
అడ్డగోలు సర్టిఫికెట్లు.. నేతల అండదండలు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసన్నపేట నియోజకవర్గంలో ఒక ఎముకల వైద్యుడు, అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో దివ్యాంగుల సర్టిఫికెట్లను అడ్డగోలుగా ఆమోదించి సదరం ద్వారా మంజూరు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత విచారణలు, ఫిర్యాదులతో ఆ బాగోతం నుంచి గట్టెక్కేందుకు ప్రస్తుత ప్రజాప్రతినిధులతో సదరు వైద్యుడు మచ్చిక చేసుకున్నాడని సమాచారం. వారి అండతోనే శ్రీకాకుళం నగరంలో తన ప్రైవేటు క్లినిక్‌ను ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ల వ్యవహారంలో ఆ డాక్టర్‌పై ఇప్పటికీ తీవ్ర ఆరోపణలు ఉండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వారిని దూరం పెట్టకుండా సాన్నిహిత్యతంగా ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది.
నిరుపయోగంగా 247 వెంటిలేటర్లు..
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏకంగా 247 వెంటిలేటర్లు పనిచేయకుండా మూలకు చేరాయి. వీటిని బాగుచేయించకపోవడం, కనీసం నిధుల మంజూరుపై చర్చ జరగకపోవడం గమనార్హం. ఏదైనా భారీ విపత్తు సంభవిస్తే, అత్యవసర వైద్యం కోసం రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయడమే గతి అన్నట్లుగా పరిస్థితి దాపురించింది.
ఆకస్మిక తనిఖీలు ఏవి..?
ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా గుర్తించారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించడంతో అక్కడ కొంతమేర మార్పు వచ్చింది. కానీ శ్రీకాకుళం రిమ్స్‌లో మాత్రం ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలకు, ప్రముఖ కార్యక్రమాలకు మాత్రమే మందీమార్బలంతో హాజరవుతున్నారు. ఇదే అదనుగా అధిక మంది డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రిలో వేతనాలు తీసుకుంటూ.. విధులను ఎగ్గొట్టి.. సొంత క్లినిక్‌లను నడుపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు సక్రమంగా సేవలు అందడం లేదు. టెక్కలి తరహాలోనే శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. రోగుల నుంచి నేరుగా అభిప్రాయాలు స్వీకరించి, లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు కొంతమంది ప్రభుత్వ వైద్యులపై మమకారం వీడి, సాధారణ ప్రజలకు సక్రమంగా సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.