వరి విత్తనాలు సిద్ధం!
ABN , Publish Date - May 18 , 2026 | 12:04 AM
Paddy seeds on subsidy ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లామొత్తంగా 1,54,230 హెక్టార్లలో వరి పండించే ప్రాంతం ఉండగా.. 31,058 క్వింటాళ్ల తొమ్మిది రకాల వరి విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా అందించేందుకు సిద్ధం చేశారు.
సబ్సిడీపై 31,058 క్వింటాళ్లు అందుబాటులోకి..
రీసెర్చ్ వెరైటీలపైనే రైతుల ఆసక్తి
టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లామొత్తంగా 1,54,230 హెక్టార్లలో వరి పండించే ప్రాంతం ఉండగా.. 31,058 క్వింటాళ్ల తొమ్మిది రకాల వరి విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా అందించేందుకు సిద్ధం చేశారు. పదేళ్లు పైబడిన విత్తన రకాలు కిలోకు రూ.5 సబ్సిడీ, పదేళ్లు లోపు ఉన్న విత్తన రకాలకు కిలోకు రూ.10 సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ వరి విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి జిల్లా రైతులు రీసెర్చ్ వెరైటీ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. ఈ విత్తనాలను నూజివీడు ప్రైవేట్ సీడ్స్, తణుకు, తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్, జగిత్యాల, సిద్ధిపేట, హుజారాబాద్ తదితర ప్రాంతాల నుంచి నూజివీడు సంపద, కనెక్ట్‌ప్లస్, సుభద్ర, పూర్ణిమ, రాణి, అమూల్య గోల్డ్ తదితర రకాల విత్తన డీలర్లు తెచ్చి రైతులకు అమ్మకాలు చేస్తున్నారు. తెగుళ్లు సోకని, అధిక దిగుబడులు ఇచ్చే రీసెర్చ్ వెరైటీలపైనే మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయశాఖ ద్వారా సరఫరా అవుతున్న కొన్నిరకాల విత్తనాలు ఏటా మిగిలిపోతున్నాయి. మరోవైపు 1010 రకం వరి పండించవద్దని, దాంట్లో బ్రోకెన్ శాతం ఎక్కువగా వస్తుందని ఇప్పటికే పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేయడంతో రైతులకు ఆ రకం విత్తనాల సరఫరా నిలిపివేశారు. రైతులకు అవసరమైన విత్తనాలను ఈ నెలాఖరు నాటికి పంపిణీ చేయనున్నారు.
పూర్తిస్థాయిలో సరఫరా చేస్తాం
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సరిపడా వరి విత్తనాలు 31,058 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద ఫౌండేషన్ సీడ్ 836 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. కేంద్ర పథకాల్లో భాగంగా ఏఎఫ్‌ఎస్‌ఎన్‌వీ పథకం కింద మరో 6,500 క్వింటాళ్లు విత్తనాలు రాగానే సరఫరా చేస్తాం. ఏ ఒక్కరికి విత్తన కొరత రానివ్వం. సబ్సిడీ విత్తనాలను రైతులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి.
- వై.మురళీమోహన్, జిల్లా వ్యవసాయాధికారి
సిద్ధం చేసిన విత్తన రకాలు (క్వింటాళ్లలో..)
---------------------------
ఎంటీయూ-1061 (ఇంధ్ర) 7,850
ఎంటీయూ-1064 (అమర) 2,993
ఎంటీయూ-1121 (శ్రీధుతి) 4,300
ఎంటీయూ-7029 (స్వర్ణ) 4,500
ఆర్‌జీఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) 2,700
బీపీటీ-3291 (సోనా మసూరి) 1000
బీపీటీ-5204 (సాంబ) 4,865
ఎంటీయూ-1224 (మార్టూర్ సాంబ) 1,170
ఎంటీయూ-1318 1,680
-----------------------------------------
మొత్తం 31,058
----------------------------------------