సివిల్ సప్లై రిటైర్డ్ డీఎం జయరామ్ పెన్షన్‌లో 5 శాతం కోత
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:50 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ శ్రీకాకుళం జిల్లా మేనేజర్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హెచ్‌వీ జయరామ్ పెన్షన్‌లో ఐదేళ్ల పాటు 5 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ విజెలెన్స్ శాఖ శుక్రవారం జీవోఆర్టీ 1188 విడుదల చేసింది.
కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు
శ్రీకాకుళం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ శ్రీకాకుళం జిల్లా మేనేజర్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హెచ్‌వీ జయరామ్ పెన్షన్‌లో ఐదేళ్ల పాటు 5 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ విజెలెన్స్ శాఖ శుక్రవారం జీవోఆర్టీ 1188 విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మొగ లిపాడుకు చెందిన మురళీకృష్ణ మోడ్రన్ రైస్ మిల్, పలాసకు చెందిన కలమ్మతల్లి ట్రేడర్స్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్స్‌లో జరిగిన అక్రమాలపై జయ రామ్‌తో పాటు మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం క్రమ శిక్షణా చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. విచారణ అధికారి ఇచ్చిన నివేదికలో జయరామ్‌పై మోపిన అభియోగాలు ‘పాక్షికంగా రుజువైనట్లు’ నిర్ధారణ అయ్యాయి. ఈ విచారణ నివేదికను, దీనిపై సదురు అధికారి ఇచ్చిన వివరణను పరిశీలించిన అనం తరం ప్రభుత్వం పెన్షన్‌లో కోత విధిస్తూ ఫైనల్‌గా శిక్షను ఖరారు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ను, సీసీఎల్‌ఏను ప్రభుత్వం ఆదేశించింది.