పోలీసులంటే బాధ్యత
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:06 AM
Passing-out parade of 142 constables పోలీసులంటే ప్రజలో భయం కాదు.. బాధ్యత అనే భావన కలిగించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, సహకారశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. నిజాయితీ, నిష్పక్షపాతంతో సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు.
ప్రజాసేవలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
శాంతిభద్రతలతోనే రాష్ట్ర ప్రగతి
టెక్నాలజీతో వైట్‌కాలర్ నేరాలు, గంజాయి కట్టడి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
డీపీటీసీలో అట్టహాసంగా 142 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
శ్రీకాకుళం/క్రైం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పోలీసులంటే ప్రజలో భయం కాదు.. బాధ్యత అనే భావన కలిగించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, సహకారశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. నిజాయితీ, నిష్పక్షపాతంతో సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో మంగళవారం 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల (2025-26, 6వ బ్యాచ్) ప్రాథమిక శిక్షణ(10 నెలలపాటు) ముగింపు సందర్భంగా ‘పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్)’ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్న.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలసి కవాతును పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు. సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ప్రగతి వేగంగా సాగుతుంది. గతంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ను ఆపేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుల్లో కేసులు వేసినా.. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి కేవలం ఎనిమిది నెలల్లోనే 5,800 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో వెయ్యి మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు ఉండటం గర్వకారణం. మరో 1,156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఇకపై ఏటా క్రమం తప్పకుండా పోలీసు నియామకాలు ఉంటాయ’ని స్పష్టం చేశారు. ‘మారుత్నున కాలానికి అనుగుణంగా వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు గంజాయి నిర్మూలన, మహిళలపై నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని నేరాలను సమర్థతంగా ఎదుర్కోవాలి. విధి నిర్వహణలో బేధం లేకుండా అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. భిన్నమైన ఆలోచనా దృక్పథంతో నేర నియంత్రణకు కృషి చేయాల’ని మంత్రి అచ్చెన్న కోరారు. ఇటీవల తుఫాను, వరదల సమయంలో జిల్లాలో పోలీసులు అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా నిరంతరం సంబంధాలు కలిగి ఉండేది కానిస్టేబుళ్లే. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు చట్టపరిధిలో తక్షణ స్పందన అందించాలి. తద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. మాదకద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై మరింత దృష్టి పెట్టాల’ని సూచించారు.
సాంకేతికతతో రాణించాలి
ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘ఉన్నత విద్యార్హతలు కలిగిన నూతన కానిస్టేబుళ్లు సీసీటీఎన్‌ఎస్‌తోపాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర దర్యాప్తులో రాణించాలి. బాధితుల సమస్యలను ఓపికగా విని న్యాయం జరిగేలా చూడాలి. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రిక్రూట్‌మెంట్ చేపట్టి, శిక్షణ వసతులకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. పిల్లలను దేశసేవకు అంకితం చేసిన తల్లిదండ్రుల త్యాగం వెలకట్టలేద’ని కొనియాడారు.