వరదగట్టునే తొలగించారు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:21 AM
Illegal mining in the Vamsadhara River కొత్తూరు మండలం పోనుటూరు రెవెన్యూ పరిధిలో బంకి గ్రామానికి సమీపంలో వంశధార నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు నదీ గర్భంలో యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. ఒడిశాకు తరలిస్తున్నారు.
బరితెగిస్తున్న ఇసుకాసురులు
వంశధార నదిలో అక్రమ తవ్వకాలు
టిప్పర్లతో తరలించి ఒడిశాలో నిల్వ
అక్కడి నుంచి విక్రయాలు
కొత్తూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం పోనుటూరు రెవెన్యూ పరిధిలో బంకి గ్రామానికి సమీపంలో వంశధార నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు నదీ గర్భంలో యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. ఒడిశాకు తరలిస్తున్నారు. వరదల నివారణ కోసం వేసిన ప్లడ్‌బ్యాంక్ గట్టును తొలగించి.. నదిలోకి వృత్తాకార వలయం మాదిరి మార్గం ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.
కొత్తూరు మండలంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులు మాత్రం పోనుటూరుకు సమీపంలో బంకి వద్ద అనధికార రీచ్ నిర్వహిస్తూ.. కాసులు సంపాదిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 300 టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒడిశా భూభాగంలో నిల్వ చేసి.. అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక విక్రయాలు సాగిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ప్రాంతాలకు కూడా ఇసుక రవాణా చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ లోడు రవాణా దూరం బట్టి రూ.10వేల నుంచి రూ.18వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఆరా తీసి.. ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది.
డీ-సిల్టేషన్ అనుమతి పేరుతో..
వంశధార నదిలో మట్టికట్ట తొలగింపు పేరుతో గనులశాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. పోనుటూరు సమీపంలో సర్వేనెంబర్ తెలపకుండా ఆరు హెక్టార్లలో సుమారు 60వేల క్యూబిక్ మీటర్ల పరిమాణానికి డి-సిల్టేషన్(చెత్త, కావు, బురద) పనులకుగాను పాడేరుకు చెందిన ఓ సంస్థకు గతేడాది జూన్ నుంచి ఏడాదిపాటు లీజు ఇస్తున్నట్లు గనుల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు చూపి నదిలో రోడ్డుమార్గం ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. పోనుటూరుకు సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో .. రుగడ రహదారికి ఆనుకుని ఉన్న నదీ గర్భంలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు.
వరదలొస్తే.. ముప్పే
మారుమూల ప్రాంతంలో ఉన్న బంకి గ్రామం నిర్మానుష్యంగా ఉంటుంది. పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదు. ఒడిశా కూడా చెంతనే ఉంది. దీంతో ఇసుకాసురులు ఇక్కడ అక్రమ రీచ్‌ను నిర్వహిస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వంశధార వరదల నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన ప్లడ్‌బ్యాంక్‌ను తొలగించి.. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వరదలు వస్తే.. తమకు ముంపు సమస్య తప్పదని పోనుటూరు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. వరదగట్టు మళ్లీ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ విషయమై కొత్తూరు తహసీల్దార్ వై.జోగారావు వద్ద ప్రస్తావించగా.. ‘పోనుటూరు వద్ద వంశధార నది వరదగట్టు తొలగించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ప్రాంతాన్ని ఎస్‌ఐతో కలిసి పరిశీలించాం. వరదగట్టు తొలగింపు ప్రాంతాన్ని పూడ్చివేయాలని ఆదేశించాం. డీ-సిల్టేషన్‌కు గనుల శాఖ అనుమతి ఇచ్చింది తప్ప.. నదిలో ఇసుక తరలింపునకు అనుమతి లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవు’ అని తెలిపారు.