శాస్త్రులపేటలో ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 PM
మండలంలోని శాస్ర్తులపేటలో శనివారం అధికారులు ఆక్రమణలు తొలగించారు.
సరుబుజ్జిలి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శాస్ర్తులపేటలో శనివారం అధికారులు ఆక్రమణలు తొలగించారు. గ్రామంలోని 89 సర్వేనెంబర్ గ్రామకంఠం మురుగునీటి బంద ప్రాంతాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి శ్లాబు ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టాడు. ఈ అక్రమ నిర్మాణంపై కొందరు గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నాలుగు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో తహసీల్దార్ ఎం.నళినాక్షి, ఎంపీడీవో ఎం.పావని, గ్రామ సచివాలయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉదయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. శ్లాబు ఎత్తులో నిర్మాణం జరిగిన భవనాన్ని కూల్చివేతకు యంత్రం కూడా తీసుకువచ్చారు. అధికారులు పోలీస్ బందోబస్తు కోరగా ఆమదాలవలస సీఐ ఎం.సన్యాసినాయుడు, ఎస్‌ఐలు బాలరాజు, ప్రవల్లికలతో కలిసి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నిర్మాణదారుడు ఆయన భార్య అధికారులకు మొర వినిపించుకున్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేసుకోవాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పంచాయతీ కార్యదర్శి బి.అనీల్ కుమార్ యం త్రంతో మండల అధికారులు, పోలీసుల సమక్షంలో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు.