స్థానిక ఎన్నికలను తలపించేలా...
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:05 AM
గత నెల 29న నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మండలంలోని మూడు పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఆ మూడు పాఠశాలలకు శుక్రవారం ఎన్నికలను నిర్వహించారు.
హిరమండలం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గత నెల 29న నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మండలంలోని మూడు పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఆ మూడు పాఠశాలలకు శుక్రవారం ఎన్నికలను నిర్వహించారు. అవలంగి జెడ్పీప ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్‌ఎమ్‌సీ ఎన్నిక పోలీసు బందోబస్తు మధ్య పకడ్బందీగా జరిగింది. టీడీపీ, వైసీపీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చివరకు టీడీపీ మద్దతుదారుడు శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల వద్ద ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో కొత్తూరు సిఐ చింతాడ ప్రసాదరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ మద్దతుదారులు పోటీలో ఉండకపోవడంతో టీడీపీ మద్దదారుడు లోలుగు శ్రీరాములను చైర్మన్‌గా ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలను తలపించేలా మండలంలోని మొత్తం టీడీపీ నాయకులు, కొంత మంది వైసీపీ నాయకులు ఉదయాన్నే గ్రామానికి చేరుకొని ఎన్నిక ముగిసే వరకు ఉన్నారు. హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా ఎన్.మిన్నారావు, రుగడ ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్‌గా తవిటమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శ్రీముఖలింగంలో మరోసారి వాయిదా
జలుమూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగం ఉన్నత పాఠశాల ఎస్.ఎం.సి. ఎన్నిక కోరం లేక మరోసారి వాయిదా పడింది. గత నెల 29న కోరం లేక వాయిదా పడడంతో శుక్రవారం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇరుపార్టీలు రెండు క్యాంపులు నిర్వహించి పిల్లలు తల్లిదండ్రులను ఉంచారు. ఇరువర్గాలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంఈవోలు బి.మాధవరావు, ప్రసాదరావులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్.ఐ. బి.అశోక్ బాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోటబొమ్మాళిలో...
కోటబొమ్మాళి, ఆక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇరువర్గాల మధ్య అధిపత్య పోరుతో మండలంలోని దండ ప్రాఽథమికోన్నత పాఠశాల స్కూల్ మెనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదా పడింది. సెప్టెంబరు 29న విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య అధిపత్య పోరు...రెండువర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో ఉపాధ్యాయులు ఎన్నికలు నిర్వహించలేక వాయిదా వేశారు. ఈసారి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పార్టీల అండతో విద్యార్థుల తల్లిదండ్రులు ఘర్షణలకు దిగడంతో తమకు ఇచ్చిన సమయంలో ఎన్నిక నిర్వహించలేక వాయిదా వేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.తవిటినాయుడు తెలిపారు. నీలంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా లాడి రమేష్, వైస్ చైర్మన్‌గా జి. కల్యాణిలు ఎన్నికయ్యారని హెచ్‌ఎం డి.నారాయణరావు తెలిపారు..
మందస, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి): అంబుగాం హైస్కూల్ ఎస్‌ఎంసీ అధ్యక్షునిగా దేవాడ హేమరాజు, ఉపాఽధ్యక్షురాలిగా మల్లా మీనాక్షిని ఎన్నుకున్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేక వాయిదా పడిన విషయం తెలిసిందే.
పోలాకి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక పీఎంశ్రీమోడల్ స్కూల్, ఈదులవలస పాఠశాల, కళాశాల ఎస్‌ఎంసీల ఎన్నిక శుక్రవారం జరిగింది. పీఎంశ్రీ మోడల్ పాఠశాల చైర్మన్‌గా మెండ తాతమ్మ, ఉపాధ్యక్షులుగా కొంగరాపు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎల్.ఎన్.పేట, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): లక్ష్మీనర్సుపేట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో యాజమాన్య కమిటీ ఛైర్మన్‌గా వైశ్యరాజు శ్రీనివాసరాజు, వైస్ చైర్మన్‌గా ఇజ్జరాతు మౌనికను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎంఈవోలు సిహెచ్.మణికుమార్, కె.చంద్రమౌళి తెలిపారు.