Share News

‘ఆక్వా’కు ఊరట

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:13 AM

Huge subsidy on electricity ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆక్వాసాగుకు వినియోగించే విద్యుత్‌ను రాయితీపై యూనిట్‌ రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జిల్లాలో 1,500 మంది వరకూ లబ్ధి పొందే అవకాశం ఉంది.

‘ఆక్వా’కు ఊరట
ఇచ్ఛాపురంలో రొయ్యలచెరువు

  • విద్యుత్‌పై భారీ రాయితీ

  • యూనిట్‌ కేవలం రూ.1.50కే..

  • జోన్‌, నాన్‌జోన్‌ పరిమితి సడలింపు

  • 10 ఎకరాలకుపైగా సాగుకు సైతం లబ్ధి

  • ఇచ్ఛాపురం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆక్వాసాగుకు వినియోగించే విద్యుత్‌ను రాయితీపై యూనిట్‌ రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జిల్లాలో 1,500 మంది వరకూ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆక్వా ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం, అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్‌ పన్నుల ప్రభావం ఆక్వా రంగంపై పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం రాయితీపై విద్యుత్‌ అందించనుండడంతో ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 11 తీర మండలాల్లో 4 వేల హెక్టార్లల్లో ఆక్వా సాగవుతోంది. ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, సంతబొమ్మాళి, పోలాకి తదితర మండలాల్లో సుమారు 1500 మంది చేపల చెరువులు సాగు చేస్తున్నారు. వాటిలో 10వేల మంది వరకూ పని చేస్తున్నారు. ఇక్కడ నుంచి రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తూ.. ఏడాదికి రూ.200కోట్ల వరకు క్రయవిక్రయాలు చేపడుతున్నారు. వైసీపీ పాలనలో ఆక్వా రంగానికి ప్రోత్సాహం లేకపోయింది. పెరిగిన మేతలు, మందుల ధరలు, లీజు వ్యవహారాలతో ఆక్వారంగం దెబ్బతింది. ఆక్వా జోన్ల సమస్య, విద్యుత్‌ ధరలతో ఏకంగా కుదేలైంది. వైసీపీ అధినేత జగన్‌ రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. కానీ అమలుచేయలేకపోయారు. ఈ-షిప్‌ విధానంలో అనేక నిబంధనలను తెరపైకి తెచ్చారు.

  • టీడీపీ హయాంలో వంద రొయ్యల ధర రూ.250 నుంచి రూ.260 వరకూ ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.180కు పడిపోయింది. ఉప్పు, మంచినీరు ఆక్వా జోన్లుగా విభజించారు. పది ఎకరాల్లోపు సాగుచేసిన రైతులకు మాత్రమే యూనిట్‌ విద్యుత్‌ రూ.2.50 చొప్పున అందించారు. దీంతో జిల్లాలో వందలాది మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ అందకుండా పోయింది. పది హార్స్‌పవర్‌ విద్యుత్‌ మోటారును వినియోగించేవారికి రాయితీ వర్తించదని.. ఈ-షిప్‌ విధానంలో చెరువుల లీజు ఒప్పందం, లైసెన్స్‌, విద్యుత్‌ మీటరు, భూమి ఆన్‌లైన్‌ పత్రాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. వీటిలో ఏ ఒక్కటీ లేకపోయినా యూనిట్‌ విద్యుత్‌కు రూ.6 వరకూ కట్టాల్సి వచ్చేది. దీంతో లక్షల రూపాయలు విద్యుత్‌ బిల్లులు చెల్లించిన చాలామంది చెరువుల సాగును నిలిపివేశారు.

  • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కి తగ్గించింది. తాజాగా దానిని కొనసాగించడమే కాకుండా.. జోన్‌, నాన్‌జోన్‌ అన్న పరిమితిని సడలించింది. 10 ఎకరాల పరిమితి సైతం లేకుండా అర్హులైన ప్రతి ఆక్వారైతుకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ పరిణామంతో మళ్లీ ఆక్వారంగం ఊపందుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • శుభ పరిణామం

  • ఆక్వా రైతాంగానికి రాయితీపై విద్యుత్‌ అందిస్తుండడం శుభ పరిణామం. ఎటువంటి పరిమితులు లేకుండా యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కు అందించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఉపశమనం కలిగించింది.

  • - రత్నాల వాసుదేవరావు, ఆక్వా నిర్వాహకుడు, ఇచ్ఛాపురం

Updated Date - Aug 14 , 2026 | 12:13 AM