‘సీఆర్‌ఆర్’ రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:14 AM
ఉత్తరాంధ్రకు, ముఖ్యంగా జిల్లాకు జీవనాడి లాంటి చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ (సీఆర్‌ఆర్) రహదారికి మోక్షం లభించింది.
- రూ.863 కోట్లతో చిలకపాలెం-రాయగడ హైవే అభివృద్ధి
- పీపీపీ విధానంలో 131 కిలోమీటర్ల మేర పనులు
- ప్రాధాన్యం జాబితాలో చేర్చిన కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు, ముఖ్యంగా జిల్లాకు జీవనాడి లాంటి చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ (సీఆర్‌ఆర్) రహదారికి మోక్షం లభించింది. పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో సుమారు రూ.863 కోట్లతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలోని ఆరు అత్యంత ప్రాధాన్య రహదారుల ప్రాజెక్టుల్లో దీనికి స్థానం కల్పించడంతో త్వరలోనే పనులు పట్టాలెక్కనున్నాయి.
ఇదీ పరిస్థితి..
ఉత్తరాంధ్రలోని మూడు ప్రధాన రహదారుల్లో ‘సీఆర్‌ఆర్’ రోడ్డు ఒకటి. జిల్లాలోని చిలకపాలెం వద్దే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కూనేరు వరకు ఉంటుంది. ప్రతిరోజూ జిల్లా నుంచి వేలాది వాహనాలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఒడిశాకు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రధానంగా రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం, కూనేరు మార్గాల్లో రోడ్లన్నీ భారీ గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం నుంచి ఒడిశా వెళ్లే సరుకు రవాణా వాహనాలు, బస్సులు, ద్విచక్ర వాహనదారుల ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రయాణికుల కష్టాలను గమనించిన కూటమి ప్రభుత్వం దీనికి మహర్దశ కల్పించే దిశగా వేగంగా అడుగులు వేసింది. మొత్తం 131 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయనుంది.
సిద్ధమైన డీపీఆర్..
రూ.863 కోట్ల భారీ అంచనాతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రహదారులు, భవనాలు శాఖ అధికారులు ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశారు. పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు రెండు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న రోడ్డునే విస్తరించడమా? లేక భారీ ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యేక బైపాస్ నిర్మించడమా ? అనేదానిపై కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాకు ఒడిశాతో ఉన్న రవాణా కనెక్టివిటీ అద్భుతంగా మెరుగుపడనుంది. రవాణా సమయం (లాజిస్టిక్ ట్రాన్సిట్ టైమ్) భారీగా ఆదా అవుతుందని, వాహనదారుల కష్టాలు శాశ్వతంగా తీరుతాయని నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ మించి శ్రీకాకుళం, సరిహద్దు ప్రాంతాల మధ్య వాణిజ్యం మరింత పుంజుకొని స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.