Share News

ఆక్వా రైతులకు ఊరట

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:07 AM

Key decisions at the Cabinet meeting అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు జిల్లా వాసులకు, ముఖ్యంగా ఆక్వా రైతులకు ఊరటనివ్వనున్నాయి.

ఆక్వా రైతులకు ఊరట

  • రాష్ట్ర క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు

  • యూనిట్‌కు రూ.1.5 చొప్పున విద్యుత్‌ రాయితీ పొడిగింపు

  • ఏజెన్సీకి తప్పనున్న సిగ్నల్‌ కష్టాలు..

  • ‘సుడా’ పరిధిలోనూ రానున్న మార్పులు

  • గ్రూప్‌-1 ద్వారా 50 శాతం డీఈవో పోస్టుల భర్తీ

  • శ్రీకాకుళం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు జిల్లా వాసులకు, ముఖ్యంగా ఆక్వా రైతులకు ఊరటనివ్వనున్నాయి. జిల్లాలో సుదీర్ఘ తీరప్రాంతం వెంబడి వేలాది కుటుంబాలు ఆక్వా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. విద్యుత్‌చార్జీల భారంతో కుదేలవుతున్న రొయ్యలు, చేపల సాగుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆక్వాకల్చర్‌ ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్‌ టారిఫ్‌ రాయితీని గత జూన్‌ 1 నుంచి పొడిగిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల జిల్లాలోని ఆక్వా రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరగనుంది.

  • మారుమూల పల్లెలకు సిగ్నల్స్‌

  • ఏజెన్సీతో పాటు జిల్లాలోని అనేక మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ.. సెల్‌ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా ఉచితంగా ఇవ్వడంతోపాటు, రాయితీతో విద్యుత్‌ అందించాలని క్యాబినెట్‌ తీర్మానించింది. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • ‘సుడా’లో మార్పులు..

  • జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు (ఏపీఎంఆర్‌యూడీఏ చట్టం-2016 ప్రకారం) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) పరిధి, అధికారాల్లోనూ భవిష్యత్తులో కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి. శ్రీకాకుళం నగరంతోపాటు పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస వంటి మున్సిపాలిటీల్లో ట్రాఫిక్‌, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల సమస్యల పరిష్కారానికి ‘పెడెస్ట్రెయిన్‌ సేఫ్టీ పాలసీ-2026’ను మంత్రిమండలి ఆమోదించింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు, సీసీ కెమెరాల నిఘాతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించేలా కఠినచర్యలు అమలు కానున్నాయి.

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌...

  • విద్యాశాఖలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా 15 డీఈవో పోస్టులను సృష్టించి, అందులో 50 శాతం పోస్టులను రాబోయే గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.

  • పారిశ్రామిక ప్రగతికి ఊతం...

  • పరిశ్రమల స్థాపనకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ ఆమ్‌నిబస్‌(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) చట్టం - 2026’కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనిద్వారా జిల్లాలోని పైడిభీమవరం తదితర పారిశ్రామిక వాడల్లో అడ్డంకులు తొలగిపోయి, కొత్త పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మరోవైపు, మహిళల భద్రత కోసం ఉద్దేశించిన దిశ బిల్లును వెనక్కి తీసుకున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టల (భారతీయ న్యాయ సంహిత-2023 తదితర) ద్వారా మహిళలు, చిన్నారులకు మరింత కఠినమైన భద్రత ఉంటుందని క్యాబినెట్‌ స్పష్టం చేసింది.

Updated Date - Aug 07 , 2026 | 12:07 AM