డీపీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శిక్షలో సడలింపు
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:34 PM
జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లోని జూనియర్ అసిస్టెంట్ టి.సురేష్‌కు గతంలో విధించిన భారీ శిక్ష (మెజార్టీ పెనాల్టీ)విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సడ లింపు ఇచ్చింది.
ఇంక్రిమెంట్లు, పెన్షన్‌పై ప్రభావం లేకుండా సవరణ
ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
శ్రీకాకుళం క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లోని జూనియర్ అసిస్టెంట్ టి.సురేష్‌కు గతంలో విధించిన భారీ శిక్ష (మెజార్టీ పెనాల్టీ)విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సడ లింపు ఇచ్చింది. ఆయన సమర్పించిన సమీక్ష పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం శిక్షను సవరిస్తూ హోం (సర్వీసెస్-3) శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం జీవోఆర్టీ 1493ను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన క్రిమినల్ కేసులో క్రైం నెంబర్ 93/2020, ఐపీసీ సెక్షన్లు 447, 379, 188 రెడ్‌విత్, 34, ఏపీ మైన్స్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966 నిబంధనల కింద టి.సురేష్ ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఈ కారణంతో ఎస్పీ ఆయనకు భవిష్యత్ ఇంక్రిమెంట్లు, పెన్షన్లపై ప్రభావం పడేలా మూడేళ్ల పాటు వేతన శ్రేణిలో మూడు దశలు తగ్గిస్తూ భారీ శిక్ష విధిం చారు. దీనిపై ఆయన అప్పీలు చేసుకోగా 2023 మే 23న విశాఖపట్నం రేంజ్ డీఐజీ, ఆ తర్వాత వేసిన రివిజన్ పిటిషన్‌ను 2025 జనవరి 30న డీజీపీ తిరస్కరించారు. దీంతో ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమీక్ష పిటిషన్ సమర్పించారు. దీనిని పరిశీలించిన హోంశాఖ మూడేళ్ల పాటు వేతన శ్రేణిలో మూడు దశలు తగ్గించే శిక్షను క్యుములేటివ్ ఎఫెక్ట్ లేకుండా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.