Share News

పూరిగుడిసెల్లో.. పునరావాసం

ABN , Publish Date - May 25 , 2026 | 12:18 AM

Kalingadal Rehabilitation Colony problems గ్రామం ముంపునకు గురైతే పునరావాసం కల్పిస్తాం. సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తాం. భూములు ఇస్తాం. ఇవీ కళింగదళ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో ముంపునకు గురైన కురడాలు గ్రామస్థులకు నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. కానీ ఆ హామీలన్నీ నీటిలో కలిసి పోయాయి. కళింగదళ్‌ రిజర్వాయర్‌ గర్భంలో ఉన్న కురడాలు గ్రామాన్ని ఖాళీ చేయించి రిజర్వాయర్‌ కిందభాగంలోని మెట్టు ప్రాంతానికి తరలించారు.

పూరిగుడిసెల్లో.. పునరావాసం
కళింగదళ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులు నివసిస్తున్న పూరిగుడిసెలు.. శిథిలమైన పునరావాస కాలనీ ఇళ్లు

  • - నాణ్యతాలోపంతో శిథిలమైన ఇళ్లు

  • - 38 ఏళ్లుగా పాకల్లోనే జీవనం

  • - ఇదీ కళింగదళ్‌ పునరావాస కాలనీ వాసుల దుస్థితి

  • హరిపురం, మే 24(ఆంధ్రజ్యోతి): గ్రామం ముంపునకు గురైతే పునరావాసం కల్పిస్తాం. సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తాం. భూములు ఇస్తాం. ఇవీ కళింగదళ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో ముంపునకు గురైన కురడాలు గ్రామస్థులకు నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. కానీ ఆ హామీలన్నీ నీటిలో కలిసి పోయాయి. కళింగదళ్‌ రిజర్వాయర్‌ గర్భంలో ఉన్న కురడాలు గ్రామాన్ని ఖాళీ చేయించి రిజర్వాయర్‌ కిందభాగంలోని మెట్టు ప్రాంతానికి తరలించారు. తమ భూములు బాగుపడతాయనే ఆశయంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి ఏ మాత్రం గ్రామస్థులు అడ్డుచెప్పలేదు. దీంతో ప్రభుత్వం సుమారు 22 ఇళ్ల నిర్మాణానికి అనుమతించింది. అధికారులు ఒక కాంట్రాక్టర్‌ ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారు. అక్కడే అమాయకులైన గిరిజనులు మోసపోయారు. ఆ ఇళ్ల నాణ్యతాలోపం రెండేళ్లు దాటిన తరువాత తెలిసింది. చిన్నపాటి వర్షానికే నీరుకారి.. కనీసం నివసించేందుకు యోగ్యత లేకపోవడంతో నాలుగేళ్లకే పూర్తిగా ఇళ్లు ఖాళీ చేసి పూరిగుడిసెల్లో నివాసముంటున్నారు. నేటికి 38 ఏళ్లు అయినా.. తమకు నాణ్యమైన పక్కా ఇళ్లు నిర్మించడం లేదని నిర్వాసిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. తమ ఇళ్ల రాతలు మారడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ, వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలు వీరి ఇళ్లలో మార్పులు తీసుకురాలేదు. గతంలో కనీసం కాలనీలు మంజూరు చేస్తే ఈ ఇళ్లకు మరమ్మతులు చేపట్టి ఎలాగోలా నివాసం ఉంటామన్నా.. కనీసం అధికారులు పట్టించుకోలేదని పలువురు గిరిజనులు వాపోతున్నారు. ఇది పునరావాస కాలనీ కనుక వీటిపై ఎలాంటి ఇళ్లు ఇవ్వమని గతంలో అధికారులు చెప్పారు. దీంతోపాటు పునరావాస లబ్ధిదారులకు ఇందిరమ్మ కాలనీలకు అనర్హులని తేల్చిచెప్పడంతో వారంతా ఆందోళన చెందారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.

  • ఎమ్మెల్యే ఆదుకోవాలి

  • ప్రభుత్వాన్ని నమ్ముకున్నాక అధికారులు తీవ్రంగా మోసం చేశారు. నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందజేస్తే సరిపోయేది. కానీ కాంట్రాక్టర్‌కు ఇంటి నిర్మాణం బాధ్యత అప్పగించటంతో తీవ్రంగా నష్టపోయాం. కనీసం ఏడాది కూడా ఆ ఇళ్లలో నివసించలేదు. ఇప్పటికీ ప్రభుత్వ సహాయం లేక నిరసించిపోయాం. ఎమ్మెల్యే శిరీష దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మమ్మల్ని ఆదుకోవాలి..

    - కైలాస్‌, పునరావాస లబ్ధిదారుడు, కురడాలు

  • తుఫాన్‌ సమయంలో ఇక్కట్లు..

  • తుఫాన్‌ల సమయంతోపాటు భారీవర్షాలకు గ్రామం మొత్తం ముంపునకు గురై గిరిజనుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత తుఫాన్‌ల సమయంలో. రెండు ఇళ్లు కూలిపోయాయి. ఆ సమయంలో గ్రామస్థులంతా బుడార్సింగి పాఠశాల భవనంలో తలదాచుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీలు మంజూరు చేస్తాం.. చేయూతనందిస్తామని ప్రకటించారే తప్ప గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు.

    - సురేష్‌ పాణిగ్రహీ, మాజీ సర్పంచ్‌, బుడార్సింగి

Updated Date - May 25 , 2026 | 12:18 AM