Share News

అన్ని రైళ్లలో ‘రిగ్రెట్‌’

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:08 AM

Railways doubles charges for premium and tatkal సాధారణంగా పండుగ సమయాల్లో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే తక్కువ చార్జీలతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని. అలాగే రైలు ప్రయాణం సురక్షితమని భావించి ఎక్కువ మంది ఆశ్రయిస్తుంటారు. ఏ సమయంలోనైనా టిక్కెట్‌ ధరలు స్థిరంగా ఉంటాయన్నది ప్రజల నమ్మకం. కానీ రైళ్లలో సైతం కనికట్టు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, రద్దీగా ఉన్న రూట్ల పేరు చెప్పి అదనపు వసూలు చేస్తున్నారు.

అన్ని రైళ్లలో ‘రిగ్రెట్‌’
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో..

టిక్కెట్లు బుక్‌ అయ్యాయని చెబుతున్న రైల్వేశాఖ

ప్రీమియం, తత్కాల్‌లో రెట్టింపు వసూలు

పండుగ, పర్వదినాల్లో అదే తంతు

పైగా రద్దీ మార్గాలంటూ కొత్త నినాదం

ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు

ఇచ్ఛాపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సాధారణంగా పండుగ సమయాల్లో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే తక్కువ చార్జీలతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని. అలాగే రైలు ప్రయాణం సురక్షితమని భావించి ఎక్కువ మంది ఆశ్రయిస్తుంటారు. ఏ సమయంలోనైనా టిక్కెట్‌ ధరలు స్థిరంగా ఉంటాయన్నది ప్రజల నమ్మకం. కానీ రైళ్లలో సైతం కనికట్టు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, రద్దీగా ఉన్న రూట్ల పేరు చెప్పి అదనపు వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌లోనే టిక్కెట్ల ధర పెంపు చూశాం. ఇప్పుడు రైళ్లలోనూ అదే పంథా కొనసాగుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌ నడుస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబాయి, కలకత్తా నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇది మంచిదే అయినా.. ప్రీమియం తత్కాల్‌, తత్కాల్‌ పేరుతో అదనపు వసూళ్లకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని రైళ్లలో టిక్కెట్ల బుకింగ్‌ అంటూ ‘రిగ్రెట్‌’ (సీట్లు ఖాళీగా లేవు. వెయిటింగ్‌ లిస్టు కూడా నిండిపోయింది.) అని చూపిస్తున్నారు.

వెయిటింగ్‌ లిస్టు చూపి..

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విశాఖకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రూట్ల మధ్య త్రీటైర్‌ ఏసీ టిక్కెట్‌ ధర అక్షరాలా రూ.770. అయితే ముందస్తు బుకింగ్‌లో భాగంగా రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీలో వెయిటింగ్‌ లిస్టు చాంతాడంత ఉంటుంది. దాని పక్కనే టిక్కెట్‌ ధర రూ.1800 నుంచి రూ.2000 వరకూ ఉంటోంది. 80 శాతం కన్ఫర్మ్‌ అయ్యే చాన్స్‌ ఉంటుందంటూ చెబుతోంది. దీంతో అవసరం మనది కనుక.. బయట బస్సుల్లో అంతకంటే ఎక్కువ టిక్కెట్‌ ధర ఉండడంతో ఇట్టే బుక్‌ చేస్తున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, టూటైర్‌ ఏసీ టిక్కెట్ల విషయంలో ముందస్తు బుకింగ్‌ చేసుకుంటూ మూడింతలు అదనంగా వసూలు చేస్తున్నారు.

తగ్గిన సేవాభావం..

గత కొంతకాలంగా రైల్వేశాఖలో సేవాభావం తగ్గింది. ఇప్పటివరకూ గూడ్స్‌ రవాణాలో ఆదాయమార్గాలను చూసుకునేది. ప్రజా రవాణా విషయంలో కాస్తా వెసులబాటు ఇచ్చేది. టిక్కెట్‌ ధరలు కూడా అదుపులో ఉండేవి. కానీ ఇప్పడు పూర్తిగా వ్యాపార ధోరణిలో మారిపోయినట్టు కనిపిస్తోంది. అచ్చం ప్రైవేటు ట్రావెల్స్‌ మాదిరిగా వ్యవహరిస్తోంది. ఆదాయం తక్కువగా వస్తున్నాయని చెప్పి ప్యాసింజర్‌ రైల్‌ సర్వీసులను నిలిపివేసింది. కొవిడ్‌ తరువాత దాదాపు సూపర్‌ ఫాస్టు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పెంచిన రైల్వేశాఖ ప్యాసింజర్ల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వందేభారత్‌ వంటి బుల్లెట్‌ రైళ్లు ప్రవేశపెట్టామని చెబుతున్న రైల్వేశాఖ.. అందులో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతవరకు రాకపోకలు సాగిస్తున్నారన్నది మాత్రం గుర్తించడం లేదు. ఇచ్ఛాపురం నుంచి విశాఖకు, పలాస నుంచి భువనేశ్వర్‌కు తిరుగుతున్న ప్యాసింజర్లు కూడా అరకొరే. అవి ఎప్పుడు తిరుగుతాయో.. ఎప్పుడు తిరగవో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించింది టిక్కెట్ల బాదుడును నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

టిక్కెట్ల ధరలు పెరిగాయి..

గతం కంటే రైళ్ల టిక్కెట్ల ధరలు పెరిగాయి. అప్పట్లో తక్కువ డబ్బులతోనే మాలాంటి పేదవారి ప్రయాణాలు సాగేవి. ఇప్పుడు జనరల్‌ బోగీలు తగ్గించారు. రిజర్వేషన్‌ చేసుకుందామంటే అదనపు బాదుడు తప్పడం లేదు. టిక్కెట్‌ ధర ఒకలా ఉంటే.. ముందస్తు బుకింగ్‌లో మరోలా చూపిస్తోంది. అవసరం అనుకున్న వారు తప్పక బుక్‌ చేయాల్సిన పరిస్థితి.

-పాతిర్ల ప్రతాప్‌రెడ్డి, ప్రయాణికుడు, ఇచ్ఛాపురం

ఇది చాలా దారుణం..

గతంలో రైలు అంటే పేదవాడి వాహనం. కానీ ఇప్పుడు పెద్దల వాహనంగా మారిపోయింది. టిక్కెట్ల ధరలు రకరకాల రూపంలో పెంచేస్తున్నారు. మనుషుల అవసరాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారు. ప్రీమియం, తత్కాల్‌ టిక్కెట్ల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది చాలా దారుణం.

-తిప్పన లక్ష్మణరావు, ప్రయాణికుడు, ఇచ్ఛాపురం

Updated Date - Jan 11 , 2026 | 12:08 AM