వినాయక మండపాల వివరాలు వెబ్‌లో నమోదు చేసుకోండి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:45 PM
కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలో వినాయక చవితి మండపాలను తప్పనిసరిగా వెబ్‌లో నమోదు చేసుకొని అనుమతులు పొందాలని, పెండాళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని సూచించారు.
కాశీబుగ్గ డీఎస్పీ భవాని
పలాస, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలో వినాయక చవితి మండపాలను తప్పనిసరిగా వెబ్‌లో నమోదు చేసుకొని అనుమతులు పొందాలని, పెండాళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని సూచించారు. గురువారం ఆమె తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నమోదైన మండపాల వివరాల ప్రకారం మండలాలు, మున్సిపాలిటిల్లో బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ముందురోజు అంతా పరిశీలిస్తామని చెప్పారు. పందిళ్ల వద్ద డీజే సౌండ్‌బాక్స్‌లు పూర్తిగా నిషేధించినట్టు ఆమె చెపాప్పరు. సంప్రదాయ పాటలు, మైక్‌సెట్లకే అనుమతులు ఇస్తామన్నారు. నిమజ్జన స్థలాన్ని నిర్వాహకులలు తమకు తెలియజేయాలని...రోడ్లపై వినాయక పందిళ్లు వేయవద్దని సూచించారు. నిమజ్జనోత్సవం రోజున కూడా డీజేలు వద్దని స్పష్టం చేశారు. మందుగుండు సామగ్రిని పూర్తిగా నిషేధించినట్టు చెప్పారరు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. నీరులేని చోట అవసరమైన పక్షంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి నిమజ్జనం ఏర్పాట్లు చేస్తామన్నారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దన్నారు. ఎటువంటి రుసుం లేకుండా మండపాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. సమావేశంలో సీఐలు జి.రామకృష్ణ, ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.