Share News

రెఫరల్‌ ఆస్పత్రి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:42 PM

నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు సేవలు మాటున కొందరు వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారు.

రెఫరల్‌ ఆస్పత్రి
నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ఇదే

- రక్తపరీక్షలు బయట చేయించుకోండి

- మందులు కూడా మెడికల్‌ షాపుల్లో కొనుక్కోండి

- ఇక్కడ వద్దు మా క్లినిక్‌కు వచ్చేయండి

- ఇదీ నరసన్నపేట ఆసుపత్రిలో కొందరి వైద్యుల తీరు

- చక్రం తిప్పుతున్న ఓ డాక్టర్‌

నరసన్నపేట, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు సేవలు మాటున కొందరు వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారు. రక్తపరీక్షల కోసం రోగులకు బయట ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. మందులు, బేబీ కిట్లు వంటి వాటిని బయట షాపుల్లో కొనుగోలు చేయిస్తున్నారు. దీనికోసం కొంత పర్సంటేజ్‌ తీసుకుంటున్నారు. కొందరు వైద్యులైతే ఈ ఆస్పత్రిలో వద్దని, తమ సొంత క్లినిక్‌కు వస్తే చూస్తానని రోగులకు చెబుతున్నారు. కంచే చేను మేసిన చందాన ఇక్కడ పర్యవేక్షణ చేయాల్సిన ఓ డాక్టరే అన్ని తానై వ్యవహరించి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

నరసన్నపేట ఆస్పత్రిలో రోజుకు 350 నుంచి 450 వరకు ఓపీ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించింది. అయితే, రోగులకు సేవలు అందించాల్సిన వైద్యుల్లో కొందరు కాసులకు కక్కుర్తిపడి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గర్భిణులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సదుపాయాలు, సిబ్బంది ఉన్నా ఇక్కడ చేయడం లేదు. ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు గర్భిణులను అక్కడకు పంపిస్తున్నారు. రక్తపరీక్షలు బయట చేయించుకుని రావాలని చెప్పి చిన్న తెల్ల కాగితంపై రాసి ఇస్తున్నారు. రక్తనమునాలు సేకరించే వ్యక్తి ఫోన్‌ నెంబరు కూడా చెబుతున్నారు. బయట ల్యాబ్‌లో రక్తపరీక్ష చేయించుకునేందుకు రూ.1200వరకు రోగులు చెల్లిస్తున్నారు. ఇక పుట్టిన బిడ్డకు పచ్చెకామెర్ల పరీక్షలు నిర్వహించాలని చెప్పి మళ్లీ అదే ల్యాబ్‌కు పంపిస్తున్నారు. తల్లీబిడ్డలను డిశ్చార్జి చేసే ముందు చిన్న పిల్లల వైద్యులు వచ్చి పరీక్షల కోసం చిన్నకాగితం మీద రాసి ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ల్యాబ్‌కు రిఫర్‌ చేస్తారు. ఇక్కడ నవజాతి శిశువుకు రక్తపరీక్ష కోసం రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సిఫారసు చేసిన వైద్యునికి రూ.150 వరకు పర్సంటేజ్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌పేషెంట్‌ రోగులకు సంబంధించి కొన్ని రకాల మందులను ఆసుపత్రి ఎదురుగా ఉన్న షాపులో కొనుగోలు చేయిస్తున్నారు. తల్లీబిడ్డలను ఇంటికి పంపించే సమయంలో కొన్ని సిరాప్‌లతో పాటు బేబీ కిట్‌లను కూడా బలవంతంగా ఇక్కడ ఒక వైద్యుడు కొనిపిస్తున్నాడు. బయట కొనుగోలు చేసిన మందులు, బేబీ కిట్లను చూపించిన తరువాతే వారిని డిశ్చార్జి చేస్తున్నారు. ఒక కిట్‌ ధర రూ.800 ఉంటే, అందులో రూ.400 ఆ వైద్యుడి జేబులోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా, కొందరు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మధ్యాహ్నం 2 గంటల తరువాత 10శాతం మంది వైద్యులు మాత్రమే విధుల్లో ఉంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4గంటల తరువాత ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఆసుపత్రిలో రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం. బయట చేయించుకుని రావాలని ఎవరైనా వైద్యులు చెబితే వారిపై క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. మందులు కూడా బయట కొనుగోలు చేయాలని ఎవరైనా చెబితే చర్యలు తీసుకుంటాం.

-డాక్టర్‌ శ్రీనివాసబాబు, సూపరింటెండెంట్‌, నరసన్నపేట ఆసుపత్రి

Updated Date - Apr 07 , 2026 | 11:42 PM