యూరియా తగ్గిస్తే ప్రోత్సాహకం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:20 AM
No using Uria.. యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ రూపొందించిన యూరియా మితిమీరిన వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, మినుము సాగుపై అవగాహన కల్పించే పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ రూపొందించిన యూరియా మితిమీరిన వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, మినుము సాగుపై అవగాహన కల్పించే పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘ యూరియాను అవసరానికి మించి వాడితే భూసారం తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో పంటల దిగుబడి పడిపోతుంది. భూగర్భజలాలు కలుషితమై ప్రజారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. యూరియాకు బదులుగా రైతులు నానో యూరియాను వినియోగించాలి. దీనివల్ల తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం ఉంటుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి.. భూసారం మెరుగుపడుతుంది. భూసార పరీక్షలు చేయించి.. నేల స్వభావం బట్టి సమతుల్య పద్ధతిలో ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. మినుము సాగులో విత్తన శుద్ధి నుంచి తెగుళ్ల నివారణ వరకు శాస్ర్తీయ పద్ధతులు పాటించాల’ని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నానో యూరియాపై శిక్షణ ఇచ్చి వారిని ఆధునిక సాగు దిశగా ప్రోత్సహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి త్రినాధస్వామి, టెక్కలి ఉప సంచాలకులు జగన్మోహన్‌రావు, మండల వ్యవసాయాధికారి ఎస్.గోవిందరావు పాల్గొన్నారు.