తగ్గిన రవాణా భారం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:20 AM
Halting of trains in Ichchapuram and Sompet ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు రైలు ప్రయాణభారం తగ్గింది. రైల్వేశాఖ ఇచ్ఛాపురం స్టేషన్‌లో నాలుగు రైళ్లకు, సోంపేట స్టేషన్‌లో మూడు రైళ్లకు హాల్టింగ్ కల్పించింది. చిన్న స్టేషన్‌గా ఉన్న బారువలోనూ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ లభించింది.
ఇచ్ఛాపురంలో 4, సోంపేటలో 3 రైళ్లకు హాల్టింగ్
బారువలో ఆగిన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్
నియోజకవర్గంలో వేలాది మందికి ప్రయోజనం
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇచ్ఛాపురం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు రైలు ప్రయాణభారం తగ్గింది. రైల్వేశాఖ ఇచ్ఛాపురం స్టేషన్‌లో నాలుగు రైళ్లకు, సోంపేట స్టేషన్‌లో మూడు రైళ్లకు హాల్టింగ్ కల్పించింది. చిన్న స్టేషన్‌గా ఉన్న బారువలోనూ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ లభించింది. ఇచ్ఛాపురం, సోంపేట రైల్వేస్టేషన్లలో రాధికాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ బెంగళూరు అమృత్‌భారత్, న్యూజల్పయ్‌గురి నుంచి నాగర్‌కోయిల్‌కు వెళ్లే అమృత్‌భారత్ వీక్లీ రైలు, న్యూజయల్ప్‌గురి నుంచి తిరుచ్చిరాపల్లికి వెళ్లే అమృత్‌భారత్ వీక్లీ రైలుకు హాల్టింగ్ ఇచ్చారు. ఇచ్ఛాపురంలో అదనంగా అహ్మదాబాద్ పూరి ఎక్స్‌ప్రెస్‌కు సైతం హాల్టింగ్ కల్పించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రయాణికులకు కొంత భారం తగ్గింది.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మత్స్యకారులు, పలువురు ఉపాధి నిమిత్తం ఎక్కువగా వలస వెళ్తుంటారు. రైల్వే సదుపాయం సరిగా లేక ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడేవారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో జానాఘర్ రోడ్డు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, విశాఖ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్, చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఇతర ప్యాసింజర్ సర్వీసులు 19 వరకూ ఆగుతున్నాయి. ఇప్పుడు ఇచ్ఛాపురంలో అదనంగా నాలుగు సర్వీసులు అందుబాటులో రానున్నాయి. ఇచ్ఛాపురంతో పోల్చితే సోంపేట రైల్వేస్టేషన్‌లో మంగుళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్, తెంబరం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, గాంధీగామ్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లు అదనంగా నడుస్తున్నాయి. తాజాగా మూడు ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నస్టేషన్‌లో పెద్ద బండి..
మరోవైపు బారువ రైల్వేస్టేషన్‌లో కేవలం రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగేవి. దీంతో సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన వారు అటు ఇచ్ఛాపురం, ఇటు పలాస వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఇంటర్‌సిటీ సుపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో 21 గ్రామాల ప్రజలకు ప్రయాణభారం తగ్గనుంది.
కృతజ్ఞతలు..
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో నాలుగు రైళ్లకు హాల్టింగ్ కల్పించడం శుభ పరిణామం. ముఖ్యంగా పూరీ-అహ్మదాబాద్ రైలు నిలుపుదల చేయడం ఈ ప్రాంతీయులకు ప్రయోజనం. మిగతా విక్లీ రైళ్లకు హాల్టింగ్ కల్పించిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటాం.
- సాలిన జగదీష్ యాదవ్, ఇచ్ఛాపురం
శుభ పరిణామం
సుదూర ప్రాంతాలు వెళ్లాలంటే బరంపురం, పలాస రైల్వేస్టేషన్లపై ఆధారపడి వచ్చేది. కానీ ఇప్పుడు ఇచ్ఛాపురం స్టేషన్‌లోనే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తేవడం శుభపరిణామం. కొంతవరకూ రైల్వే ప్రయాణభారం తగ్గినట్టే. ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కృషి మరువరానిది.
కొరికాన యోగి, ఇచ్ఛాపురం