ఆన్‌లైన్‌లోనే ఇన్విజిలేటర్ల నియామకం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:55 PM
ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.
- నూతన మార్పులకు విద్యాశాఖ శ్రీకారం
- ఈ ఏడాది ప్రైవేటు టీచర్లకూ అవకాశం
- పారదర్శకంగా ‘పది’ పరీక్షల నిర్వహణకు చర్యలు
నరసన్నపేట, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలను మాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకాలన్నీ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలు, అదనపు డీవోలుగా ప్రభుత్వ హెచ్‌ఎంలు, సీనియర్ ఎస్‌ఏలను నియమించనున్నారు. ఇన్విజలేటర్లగా 20శాతం ప్రైవేటు టీచర్లకు అవకాశం కల్పించనున్నారు. ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాలలకు పదికిలోమీటర్ల పరిధిలోని పరీక్ష కేంద్రాల్లోనే వారు విధులు నిర్వహించేలా ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
145 పరీక్ష కేంద్రాలు..
జిల్లాలో ఈఏడాది 145 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఆయా కేంద్రాల్లో 145 మంది ఛీప్ సూపరింటెండెంట్‌లు, 145 మంది డీవోలు, 145 మంది అదనపు డీవోలతో పాటు సుమారు 1800 మంది ఇన్విజలేటర్లు, మరో 12 బృందాలను పర్యవేక్షకులుగా నియమించనున్నారు. ఈఏడాది జిల్లాలో మొత్తం 28,586 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,002మంది ప్రభుత్వ విద్యార్థులు కాగా, మిగతా 7,585మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు.
నియామకాలన్నీ రాష్ట్రస్థాయిలోనే..
టెన్త్, ఇంటర్, ఓపెన్‌స్కూల్ పరీక్షల నిర్వహణకు నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బందికి విధులు అప్పగించనున్నారు. గతంలో ఎంఈవో కార్యాలయం నుంచి ఉపాధ్యాయుల వివరాలు తీసుకుని జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో నియామకాలు చేపట్టేది. అయితే, సిబ్బంది నియామకాలపై పలు విమర్శలు వ్యక్తమయ్యేవి. ఈ నేపథ్యంలో ఈఏడాది నుంచి పారదర్శకంగా డ్యూటీ ఆర్డర్లు ఇవ్వాలనే ఆలోచనతోనే టిస్ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిలో ఉపాధ్యాయులు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు. గతంలో ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా.. వీరి పిల్లలు ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా తదితర ఏడు అంశాలపై ఎంఈవోలు ద్వారా ముందే సమాచారం సేకరించారు. వీటిలో ఏదైనా సమస్యలున్న వారిని, 60 సంవత్సరాలు దాటిన వారిని మినహాయించి మిగిలిన జాబితాలను ఎంఈవోల లాగిన్‌లకు పంపించారు. అలాగే ఇంటర్ పరీక్షల విధులకు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను నియమించవద్దని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులకు ఇంటర్ పరీక్షలకు ఇన్విజలేటర్లగా నియమించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పరిధిలో జరిగే టెన్త్, ఇంటర్ పరీక్ష పరీక్షలకు కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు.
కొందరికి మినహాయింపు
పరీక్షల విధుల్లో 60 సంవత్సరాలు దాటిని వారికి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నారు. వీరితో పాటు దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఉంటుంది. గతంలో మాదిరిగా సాకులు చెప్పి తప్పించుకునేందుకు వీలు లేకుండా అన్నీ పకడ్బందీగా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇన్విజలేటర్లగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజకల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీతం ఇతర సబ్జెక్ట్‌లు బోధించేవారిని నియమించనున్నారు. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం పరీక్షలకు గణితం, సైన్స్, సోషల్ టీచర్లను ఇన్విజిలేటర్లగా నియమిస్తారు. గ్రూప్ సబ్జెక్టులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచర్లను నియమిస్తారు. పేపర్ల మూల్యాంకనంలో కూడా తప్పిదాలు జరిగితే సంబంధిత ఉపాధ్యాయుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్విజలేటర్ల కోసం ఈఏడాది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించి పంపించినట్లు డీఈవో రవిబాబు తెలిపారు.