Share News

బీరు.. జోరు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:19 AM

More beer sales.. భానుడి భగభగలు.. చెమటలు కక్కించిన ఉక్కపోతలు.. వెరసి ఈ ఏడాది వేసవి సిక్కోలు వాసులను బెంబేలెత్తించింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలోని యువకులు, మందుబాబులు చల్లటి బీర్లను తెగ తాగేశారు. గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే.. ఈ వేసవిలో రికార్డుస్థాయిలో బీర్ల విక్రయాలు జరిగాయి.

బీరు.. జోరు

వేసవిలో రికార్డు స్థాయిలో విక్రయాలు

71 రోజుల్లోనే 3 లక్షల కేసులు తాగేశారు

జిల్లాలో రూ.64 కోట్లు దాటిన మద్యం వ్యాపారం

శ్రీకాకుళం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలు.. చెమటలు కక్కించిన ఉక్కపోతలు.. వెరసి ఈ ఏడాది వేసవి సిక్కోలు వాసులను బెంబేలెత్తించింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలోని యువకులు, మందుబాబులు చల్లటి బీర్లను తెగ తాగేశారు. గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే.. ఈ వేసవిలో రికార్డుస్థాయిలో బీర్ల విక్రయాలు జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 10వరకు జిల్లావ్యాప్తంగా సుమారు మూడు లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. బీర్ల విక్రయాల జోరుతో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,12,166 కేసులు అమ్ముడయ్యాయి. ఎండలు తారాస్థాయికి చేరిన మే నెలలో ఏకంగా 1,50,022 కేసుల(సుమారు 18 లక్షల బాటిళ్లు) బీర్లను జిల్లావాసులు తాగేశారు. ఇక జూన్‌ 1 నుంచి 10 వరకు మరో 37,530 కేసులు అమ్ముడయ్యాయి. మొత్తంగా ఈ 71 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 2,99,718 కేసుల బీర్ల విక్రయాల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు రూ. 64,68,74,741 ఆదాయం సమకూరింది.

ఏటా పెరుగుతున్న కిక్‌

గత మూడేళ్ల వేసవి (ఏప్రిల్‌, మే, జూన్‌ 10 నాటి గణాంకాలను పరిశీలిస్తే.. విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2024 వేసవిలో కేవలం 18 వేల కేసులు అమ్ముడవగా, 2025 నాటికి ఆ సంఖ్య అమాంతం రెండున్నర లక్షలు దాటింది. ఇక ఈ ఏడాది ఏకంగా సుమారు మూడు లక్షల కేసుల విక్రయాలతో, రూ.64 కోట్లకు వ్యాపారం చేరుకుంది. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం, దానికితోడు శుభకార్యాల సీజన్‌ కావడంతో చాలామంది చల్లటి బీర్ల వైపే మొగ్గుచూపారు. మొత్తానికి ఈ ఏడాది సమ్మర్‌ మందుబాబులకు ఏ రేంజ్‌లో ‘చిల్‌’ ఇచ్చిందో.. ఎక్సైజ్‌ శాఖకు, ప్రభుత్వ ఖజానాకు కూడా అదే రేంజ్‌లో కిక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.

మూడేళ్లలో బీర్ల విక్రయాల తీరు (ఏప్రిల్‌-జూన్‌ 10 వరకు):

------------------------------------------------------

సంవత్సరం అమ్ముడైన కేసులు ధర

----------------------------------------------------

2024 18,615 రూ. 4,69,92,061

2025 2,55,739 రూ. 55,04,23,356

2026 2,99,718 రూ. 64,68,74,741

Updated Date - Jun 13 , 2026 | 12:19 AM